YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?

Ys Jagan Chandrababu

Ys Jagan Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. మహాభారతంలో శకుని పాచికలు సెట్ చేసినట్లుగా చంద్రబాబు ఎన్నికలను సెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ నామినేషన్లు వేయాలి.. ఎక్కడ వేయకూడదో అధికార పార్టీనే నిర్ణయిస్తోందని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు ఎనిమిది రకాలుగా కుట్రలు జరుగుతున్నాయని జగన్ వివరించారు.

ఈరోజు మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ’15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు కూడా లేకుండా పోటీ నడిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల చైర్మన్ అభ్యర్థులు ఉన్నా వార్డు సభ్యులు లేకుండా చేశారు. మా పార్టీ అభ్యర్థులకతో ఎందుకు నామినేషన్లు వేయించడం లేదు. ఆ ధైర్యం లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగే ఎన్నికలను ఎన్నికలు అంటారా?. నామినేషన్ల సమయంలోనే పరిస్థితులు ఇలా ఉంటే.. ఎన్నికల రోజు ఎలా ఉంటుంది. మా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు తీసుకొచ్చిన మార్పులను చూపించి ఎన్నికలకు వెళ్లాము. అప్పట్లో చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల అధికారిగా ఉన్నప్పటికీ ఎన్నికలను ఎదుర్కొన్నాము. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి 98 శాతం విజయం సాధించాము. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు’ అని విమర్శించారు.

‘జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల విషయంలో కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోగా, బరితెగింపు పెరిగింది. రాష్ట్రంలో నారాసుర రక్తచరిత్ర కొనసాగుతోంది. జంగిల్ రాజ్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద ఇదే పరిస్థితి. 659 మండలాలకు గానూ 227 మండలాల్లో నామినేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మా పార్టీ అభ్యర్థులపై దాడులకు చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరిస్తున్న పోలీసులే కారణం. బాధ్యులైన వారిని విధుల నుంచి తప్పించకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయి. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ నుంచి నామినేషన్ కేంద్రాల్లో రిగ్గింగ్ వరకు చంద్రబాబు దిగజారిపోయారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేలా వ్యవస్థీకృతంగా ఎనిమిది కుట్రలకు తెరతీశారు. నామినేషన్ ప్రక్రియలో మా పార్టీ అభ్యర్థులను అడ్డుకునేందుకు ఎనిమిది రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి’ అని జగన్ వివరించారు.

వైసీపీ అభ్యర్థులపై ఎనిమిది కుట్రలు:
బెదిరింపులు: వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసే వారిని బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు.
గృహ నిర్బంధాలు: పార్టీ నాయకులను గృహనిర్బంధం చేసి ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతున్నారు.
నామినేషన్ కేంద్రాల స్వాధీనం: నామినేషన్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని తమ పార్టీ అభ్యర్థులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
నామినేషన్ పత్రాల చింపివేత: తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేస్తున్నారు.
అడ్డుకోకపోవడం: అధికార పార్టీ నేతలు దాడులు చేసి నామినేషన్ పత్రాలు చింపివేసినా అధికారులు అడ్డుకోవడం లేదని ఆరోపించారు.
బాధితులపైనే కేసులు: దాడులకు గురైన వైసీపీ నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
స్క్రూటినీ పేరుతో తిరస్కరణ: పరిశీలన పేరుతో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు.
బెదిరించి ఉపసంహరణ: అభ్యర్థులను భయపెట్టి, బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎనిమిది కుట్రలతో చంద్రబాబు అండ్ కో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.