Site icon NTV Telugu

Telangana Crime: గుట్టురట్టు చేసిన మరణ వాంగ్మూలం.. పరువుకోసం వేధింపులు దాచి..

Crime

Crime

Telangana Crime: ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. మాడ్గులపల్లి మండలం, చింతలగూడెం గ్రామానికి చెందిన కత్తా కళ్యాణి ఈనెల 6వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. చికిత్స పొందుతూ 9వ తేదీ సాయంత్రం మరణించింది. తన కూతురు కొత్త కళ్యాణి ఆత్మహత్యకు ప్రేమ వేధింపులే కారణమని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళ్యాణి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం, రజితల కుమార్తె కళ్యాణి.. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది.. అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కమ్మనబోయిన మధు.. అనే ఇద్దరు యువకులు ఆమెకు పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ప్రేమ పేరుతో కళ్యాణిని కొంతకాలంగా వేధించడం మొదలుపెట్టారని తెలుస్తుంది.

Read Also: Jaipur airport: సెక్యూరిటీపై స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి దాడి.. అసలేం జరిగిందంటే..!

ఇక, శివ, మధు ఎవరికి వారే ప్రేమ పేరుతో కళ్యాణి వెంట పడటంతోపాటు.. తమను ప్రేమించుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ.. కళ్యాణి ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలుస్తుంది.. ఊరు నుంచి కాలేజీకీ వెళ్లినా, హాస్టల్ వెళ్లినా, ఎక్కడైనా ఉద్యోగం చేసినా తమ నుండి ఫోన్ లు, మెసేజ్ లు వస్తాయని, మీ కుటుంబానికి పరువు లేకుండా చేస్తామని బెదిరించారట.. ఇటీవల కళ్యాణికి వచ్చిన పెళ్లి సంబంధం కూడా తప్పిపోవడానికి వీరిద్దరూ కారణం అనే చర్చ గ్రామంలో జరుగుతుంది. ఈనెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో విడివిడిగా ఫోన్ చేసిన శివ, మధులు కళ్యాణితో అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు, బ్లాక్ మైల్ కు పాల్పడినట్లు తెలుస్తుంది.. దీంతో వీరి వేధింపులు భరించలేక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కళ్యాణి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. పురుగుల మందు తాగిన విషయాన్ని ఆమెనే స్వయంగా తల్లిదండ్రులకు చెప్పింది.. ఆ తర్వాత కళ్యాణిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. మేరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స పొందిన అనంతరం కళ్యాణి 9వ తేదీన మృతి చెందింది.

Read Also: Ford Capri EV: సరికొత్త లుక్ లో ఫోర్డ్ కాప్రీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కి.మీ

మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మాడుగులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కళ్యాణ మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన శివ, మధులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని మృతరాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై మృతదేహంతో నిరసనకు దిగారు. మృతురాలు కళ్యాణి చికిత్స పొందుతున్న సమయంలో జడ్జి సమక్షంలో మరణ వాంగ్మూలం ఇచ్చిందని.. నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని పోలీసులు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు.. కళ్యాణి మరణవాగ్మూలంలో తన పేరు చెప్పిందని తెలియడంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో కొలుకుంటున్నాడు.. తన కూతురు ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా వేధింపుల విషయం తమ దృష్టికి తీసుకురాలేదని తల్లి చెప్తుంది.. జడ్జి వచ్చేంత వరకు తమ గ్రామానికే చెందిన ఇద్దరు యువకుల వేధింపులే తన కూతురు ఆత్మహత్యకు కారణం అనే విషయం తమకు తెలియదని.. కేవలం శివ, మధుల వేధింపులతో తమ కుటుంబం పరువు పోతుందనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

Exit mobile version