ప్రేమించలేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది యువతితో పాటు ఆమె తల్లి,చెల్లెలుపై కత్తితో దాడిచేసిన ఘటన పశ్చిమగోదావరిజల్లాలో చోటు చేసుకుంది. కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన మాణిక్యం అనే యువతిని ప్రేమ పేరుతో రాజులపాటి కళ్యాణ్ అనే ప్రేమోన్మాది రెండు నెలలుగా వేదించడంతో ఆమె అతని ప్రేమను నిరారకరించింది. దీంతో కక్ష పెంచుకున్న కళ్యాణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో యువతితో పాటు మరో ఇద్దరిపై కత్తి తో దాడికి పాల్పడిన కళ్యాణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ కి తరలించారు. గత రాత్రి కొండ్రుప్రోలు లో మాణిక్యం అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఒప్పుకోకపోయేసరికి అమ్మాయి , ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు కళ్యాణ్ అనే యువకుడు. ఇంట్లో కరెంటు తీసేసి, కరెంటు పోయిందని వారు బయటకు రాగానే తనతో తెచ్చుకున్న చాకుతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విచారించిన పోలీసులు…. ముద్దాయిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు ఎస్పీ రవి ప్రకాష్.
Read Also: Nandamuri Balakrishna: ఒంగోలు కు బాలయ్య.. అందరి చూపు ఆ బ్యాగ్ పైనే
అసలేం జరిగిందంటే..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనని ప్రేమించడంలేదనే అక్కసుతో యువతిపై కత్తితో దాడిచేశాడు. అడ్డుపడిన యువతి తల్లి, సోదరిపై కూడా కత్తితో దాడిచేయడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు మాణిక్యం అనే యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని వేధింపుల గురించి ఆ యువతి తన తండ్రికి చెప్పడంతో పెద్దల పంచాయితీలో కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు. అయినా తీరు మార్చుకోని కళ్యాణ్ గురువారం అర్ధరాత్రి యువతి ఇంటిపై దాడికి తెగబడ్డాడు. కళ్యాణ్ వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడిచేయడంతో ఆమె మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన మాణిక్యం తల్లి, సోదరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపై కూడా కళ్యాణ్ దాడికి పాల్పడ్డాడు.
అక్కడి నుంచి ఇంటి బయటికి వచ్చి అక్కడే ఉన్న గడ్డికుప్పలను తగులబెట్టి పారిపోయాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు దాడిలో గాయపడిన వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించడంతో వారు కోలుకుంటున్నారు. ప్రేమపేరుతో వేధింపులకు పాల్పడటమే కాకుండా పెద్దల సమక్షంలో హెచ్చరించినా కళ్యాణ్ తీరులో మార్పు రాలేదని, దాడికి పాల్పడి యువతితో పాటు, ఆమె తల్లి , సోదరిని భయబ్రాంతులకు గురిచేసిన ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మాణిక్యంతో పాటు వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితులకు పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులకు అవసరమైన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసారు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు సత్వరమే చర్యలు చేపడతామన్నారు. అతనిపై హత్య నేరంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేయించి సత్వరమే శిక్షపడేలా చర్యలు తీసుకుంటాని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
Read Also: CBI: ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత..