TDP and Jana Sena Clash in Elamanchili: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. యలమంచిలి మున్సిపాలిటీలోని 29వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో విజయం సాధించడంతో వివాదం మొదలైంది. టీడీపీ వర్గాలు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయంటూ జనసేన శ్రేణులు ఆరోపణలు చేస్తూ ఘర్షణకు దిగాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య నెలకొన్న ఈ వివాదం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.
యలమంచిలి మున్సిపాలిటీలోని 29వ వార్డులో మొత్తం 1,046 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఒమ్మి జగదీష్‌కు 499 ఓట్లు రాగా.. జనసేన అభ్యర్థికి 486 ఓట్లు వచ్చాయి. కేవలం 13 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితంపై జనసేన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. టీడీపీ వర్గాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలో టీడీపీ వర్గాలకు చెందిన వారి ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా భారీగా బలగాలను మోహరించారు. స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక యలమంచిలి మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా.. వాటిలో ఆరు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఒకటి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మిగతా వార్డులను కూటమి కైవసం చేసుకుంది. యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కూటమి మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పిల్లా రమాకుమారి విజయం సాధించారు.

