ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. రేపే వైసీపీ ఫైనల్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. అంతేకాకుండా.. సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేపు ఇడుపులపాయకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇలా 2 లేక 3 బహిరంగ సభలు లేదా రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 77 అసెంబ్లీ 23 పార్లమెంట్ ఇంచార్జి లను మార్చిన సీఎం జగన్… ఈ పర్యటనల లోనే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.
ఒకవైపు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై అసమ్మతి సెగలు పొగలు కక్కుతుండగా రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులను ఖరారు చేసి కదనరంగంలోకి దూకేందుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధమైంది. ఈమేరకు ఈనెల 16వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద 2019 ఎన్నికల తరహాలోనే ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.
