WPL 2027 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 ప్లేయర్ల వేలంలో యూపీ వారియర్స్ వేసిన వ్యూహాత్మక అడుగులు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్‌ను భారీ ధరకు అంటే రూ. 1.10 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ, గతంలో తమ జట్టుకే ఆడి ప్రస్తుతం ఆర్‌సీబీతో టైటిల్ గెలిచిన గ్రేస్ హ్యారిస్‌ను రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కే తిరిగి దక్కించుకుంది. అంతేకాకుండా, గత వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసి తర్వాత రిలీజ్ చేసిన ఆశా శోభనను ఈసారి కేవలం రూ. 30 లక్షలకే దక్కించుకోవడం విశేషం.
ఈ వేలంలో సోఫీ మోలినెక్స్ కోసం ఆమె పాత ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పోటీపడింది. అయితే తమ వద్ద కేవలం రూ. 1.15 కోట్ల పర్స్ మాత్రమే ఉండటంతో రూ. 1.05 కోట్ల వద్ద ఆర్‌సీబీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. యూపీ వారియర్స్ జట్టు భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా, సీనియర్ వికెట్ కీపర్ సుష్మా వర్మలను కూడా రూ. 30 లక్షల చొప్పున బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకుంది. కాగా, ఐదు సీజన్లలో నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన రికార్డును స్నేహ్ రాణా సాధించబోతోంది. వీరికి తోడు మనాలి దక్షిణి, సహనా పవార్‌లను కూడా యూపీ తమ జట్టులోకి తీసుకుంది. ఇక ముంబై ఇండియన్స్‌తో తీవ్రంగా పోటీపడి భారత హార్డ్ హిట్టర్ కిరణ్ నవ్‌గిరేను రూ. 70 లక్షల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
గుజరాత్ జెయింట్స్ కూడా తమ జట్టును బలపరిచే దిశగా అడుగులు వేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జి. కమలినిని రూ. 40 లక్షలకు, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఆర్లా ప్రెండర్‌గాస్ట్‌ను రూ. 30 లక్షలకు దక్కించుకుంది. దీంతో డబ్ల్యూపీఎల్ ఆడబోతున్న తొలి ఐర్లాండ్ ప్లేయర్‌గా ప్రెండర్‌గాస్ట్ చరిత్రకెక్కనుంది. వేలం జాబితాలో ఆఖరి నిమిషంలో చేరిన ఢిల్లీ లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సమైరా రాఘవ్‌ను కూడా గుజరాత్ తమ బేస్ ప్రైస్‌కే తీసుకుంది. కేవలం రూ. 90 లక్షల పర్స్‌తో వేలంలోకి దిగిన ముంబై ఇండియన్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఢిల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ భారతి రావల్, విదర్భ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ దిశా కసత్, వికెట్ కీపర్ లతిక ఇన్యామ్‌దార్‌లను తలో రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత యాక్సిలరేటెడ్ రౌండ్‌లో ముంబైకి చెందిన అన్‌క్యాప్డ్ బ్యాటర్ సానిక ఛాల్కేను రూ. 10 లక్షలకు, మొదటి నాలుగు సీజన్లలో యూపీ వారియర్స్‌కు ఆడిన ఢిల్లీ ఓపెనర్ శ్వేతా సెహ్రావత్‌ను కూడా ముంబై తమ జట్టులో చేర్చుకుంది.
గత మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ జెస్ జోనాస్సేన్‌ను ఆర్‌సీబీ రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకుంది. అలాగే గతంలో ముంబై ఇండియన్స్‌లో మూడేళ్లు బెంచ్ కే పరిమితమై, గతేడాది యూపీ వారియర్స్‌కు ఆడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్లోయి ట్రయాన్‌ను కూడా ఆర్‌సీబీ దక్కించుకుని తమ విదేశీ ప్లేయర్ల కోటాను పూర్తి చేసింది. తొలి రౌండ్లలో అమ్ముడుపోని భారత ఆటగాళ్లు బృందా దినేష్, తేజల్ హసబ్నిస్‌లను యాక్సిలరేటెడ్ రౌండ్‌లో ఆర్‌సీబీ కొనుగోలు చేయగా, కర్ణాటక టీనేజ్ ఆల్‌రౌండర్ ఉమా కాస్విని రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.

