Royal challengers vs Giants: డబ్ల్యూపీఎల్-4లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను 32 పరుగుల తేడాతో ఓడించిన ఆర్సీబీ, ఈ సీజన్‌లో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఇక, మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాధ యాదవ్ (47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు) హాఫ్ సెంచరీ చేసి జట్టులో కీలక ఇన్సింగ్ ఆడింది. ఆమెకు తోడుగా రిచా ఘోష్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) 44 పరుగులు సాధించగా, నదైన్ డిక్లెర్క్ 12 బంతుల్లోనే 26 పరుగులతో చెలరేగింది.
Read Also: OpenAI: షాకింగ్ న్యూస్.. ఉచిత చాట్‌జీపీటీకి బ్రేక్.. కంపెనీ సంచలన నిర్ణయం..
అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. పవర్‌ప్లేలోనే 5.3 ఓవర్లకు 43 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. గ్రేస్ హారిస్, హేమలత, కెప్టెన్ స్మృతి మంధాన, గౌతమి నాయక్ త్వరగానే పెవిలియన్ కి చేరారు. ఈ దశలో రాధ యాదవ్, రిచా ఘోష్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టి జట్టును గాడిలో పెట్టారు. ఇక, 182 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన గుజరాత్ జెయింట్స్ 18.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. భార్తీ పుల్మాలి 20 బంతుల్లో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుజరాత్ 3.4 ఓవర్లకు 34/0తో మంచి ఆరంభం చేసినప్పటికీ, ఆ తర్వాత వికెట్ల పతనం స్టార్ట్ అయింది. బెత్ మూనీ, కనిక, కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్, జార్జియా వేర్‌హామ్ వరుసగా ఔటవ్వడంతో 10.4 ఓవర్లకు 70/5గా ఉంది.
Read Also: Trump: ఇరాన్‌కు ట్రంప్ ధన్యవాదాలు.. దేనికోసమంటే..!
ఇక, ఈ సమయంలో భార్తీ పుల్మాలి అటాకింగ్ బ్యాటింగ్ చేసినా, కీలక సమయంలో శ్రేయాంక పాటిల్ కాష్వీని ఔట్ చేసి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పేసింది. అనంతరం భార్తీని లారెన్ బెల్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకోవడంతో గుజరాత్ ఆశలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రేయాంక పాటిల్ 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. లారెన్ బెల్ 3 వికెట్లు తీసుకుంది. కాగా, నాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జెయింట్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం కాగా, ఆర్సీబీ మాత్రం అద్భుతమైన ఫామ్‌తో టోర్నీలో దూసుకెళ్తోంది.
