Site icon NTV Telugu

WPL 2025 Final: బెంగళూరుతో చివరి లీగ్‌ మ్యాచ్‌.. ఫైనల్‌ వెళ్లేందుకు ముంబైకి సూపర్ ఛాన్స్!

Mumbai Indians Women

Mumbai Indians Women

మహిళల ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2025లో నేడు చివరి లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో మంగళవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబైకి.. ఫైనల్‌ వెళ్లేందుకు మరో అవకాశం ఉంది.

డబ్ల్యూపీఎల్‌ ఫార్మాట్ ఐపీఎల్ మాదిరిలా ఉండదన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో లీగ్‌ మ్యాచ్‌లు ముగిసేసరికి టాప్-4లో ఉన్న నాలుగు టీమ్స్ ప్లేఆఫ్స్‌ ఆడుతాయి. డబ్ల్యూపీఎల్‌లో లీగ్‌ మ్యాచ్‌లు ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచిన టీమ్.. నేరుగా ఫైనల్ చేరుతుంది. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచే టీమ్స్ ఎలిమినేటర్‌ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్‌ దశలో ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌.. 8 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు, ముంబై 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించి టాప్-2లో ఉన్నాయి.

Also Read: WPL 2025: మెరిసిన హర్మన్‌ప్రీత్‌.. గుజరాత్‌పై ముంబై విజయం!

రన్‌రేట్‌లో ముంబై (+0.298) కన్నా మెరుగ్గా ఉన్న ఢిల్లీ (+0.396) ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉంది. ఈరోజు చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్న ముంబైకి అగ్రస్థానం సాధించి ఫైనల్ వెళ్లేందుకు మంచి అవకాశం ముందుంది. ఈరోజు బెంగళూరును ఓడిస్తే.. ముంబై 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం సాధించి.. ఫైనల్‌ చేరుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఢిల్లీ నేరుగా ఫైనల్‌ చేరుతుంది. బెంగళూరు మ్యాచ్‌పై ముంబై ఫైనల్ భవితవ్యం ఆధారపడి ఉంది.

Exit mobile version