Shabnim Ismail records fastest ball in Women’s Cricket: దక్షిణాఫ్రికా మాజీ పేస్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా నిలిచారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో గంటకు 132.1 కిమీల వేగంతో బంతిని విసిరారు. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షబ్నిమ్.. ఈ ఫీట్ సాధించారు. 130 కిమీలకి మించిన వేగంతో బౌలింగ్ చేయడం మహిళా క్రికెట్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం.
షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన బంతిని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఎదురొన్నారు. 2016లో వెస్టిండీస్‌పై 128 కిమీల వేగంతో షబ్నిమ్ బంతిని విసిరారు. 2022 మహిళల ప్రపంచకప్ సమయంలో రెండుసార్లు 127 కిమీ వేగాన్ని నమోదు చేశారు. గత ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 16 ఏళ్ల కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరఫున 8 టీ20 ప్రపంచకప్‌లలో ఆడారు. దక్షిణాఫ్రికా తరఫున 1 టెస్ట్, 127 వన్డేలు, 113 టీ20లు ఆడిన షబ్నిమ్.. 317 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు.
Also Read: NBK 109 Teaser: నందమూరి అభిమానులకు శుభవార్త.. మార్చి 8న బాలకృష్ణ 109 టీజర్!
ప్రపంచ రికార్డు నెలకొల్పిన షబ్నిమ్ ఇస్మాయిల్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధారాళంగా పరుగులిచ్చారు. తన కోటా 4 ఓవర్లు వేసిన షబ్నిమ్.. ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక వికెట్ మాత్రమే తీశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.