NTV Telugu Site icon

Ee Sala Cup Namdu: ‘ఈ సారి కప్ మాదే’ కాదు.. ‘ఈ సారి కప్ మాది’: స్మృతి మంధాన

Ee Sala Cup Namdu

Ee Sala Cup Namdu

RCB Captain Smriti Mandhana Says Ee Sala Cup Namdu: ‘ఈ సాలా కప్ నమ్‌దే’ (ఈ సారి కప్ మాదే) అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్‌లోకి రావడం.. ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లడం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పరిపాటుగా మారింది. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌లలో విజయాలను అందించిన విరాట్ కోహ్లీ.. ఆర్‌సీబీ ప్రాంచైజీకి మాత్రం ఒక్క ట్రోఫీ కూడా ఇవ్వలేదు. గత 16 ఏళ్లలో మూడుసార్లు ఫైనల్ వరకు వచ్చి.. రన్నరప్‌గా నిలిచింది. దాంతో టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే మహిళల జట్టు మాత్రం డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‍‍లోనే కప్ సాధించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ కప్ కరువు తీర్చింది.

డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విజయాన్ని మాటల్లో చెప్పలేనని, మా టీమ్ ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నా అని చెప్పింది. ట్రోఫీని గెలిచింది తాను ఒక్కదాన్ని మాత్రం కాదని, ఇది జట్టు గెలుపు అని పేర్కొంది. ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎప్పుడూ ‘ఈ సాలా కప్ నమ్‌దే’ (ఈ సారి కప్ మనదే) అని అంటుంటారు, ఇప్పటి నుంచి ‘ఈ సాలా కప్ నమ్‌దూ’ (ఈ సారి కప్ మాది) అనండి అని చెప్పుకొచ్చారు. స్మృతి మాటలతో ఢిల్లీ స్టేడియం మొత్తం ఆర్‌సీబీ అభిమానుల కేకలతో దద్దరిల్లిపోయింది.

Also Read: Smriti Mandhana Boyfriend: బాయ్‌ ఫ్రెండ్‌తో స్మృతి మంధాన.. ఫొటోస్ వైరల్!

‘కప్ సాదించామనే గుడ్ ఫీలింగ్ ఇంకా తగ్గలేదు. నాకు మాటలు రావడం లేదు. అయితే ఓ విషయం చెప్పాలి.. మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. బెంగుళూరు లెగ్‌లో మేం బాగా ఆడాం. ఢిల్లీకి వచ్చి వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్నాం. దాంతో సరైన సమయంలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాం. గత సంవత్సర ఓటములు మాకు చాలా విషయాలు నేర్పాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకున్నాం. ఆర్‌సీబీ మేనేజ్మెంట్ మాకు మద్దతుగా ఉంది. ఇది మీ జట్టు.. మీ శైలిలో నిర్ణయాలు తీసుకోండని చెప్పింది. ఈ విజయం ఆర్‌సీబీకి ఎంతో విలువైనది. ట్రోఫీని గెలిచింది నేను ఒక్కదాన్ని కాదు, జట్టు గెలుచుకుంది. టాప్-5 విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఎవరికైనా ప్రపంచకప్ అగ్రస్థానంలో ఉంటుంది. ఆర్‌సీబీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీకు ఒకటి చెప్పాలి.. ఎప్పుడూ ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అని అంటుంటారు, ఇప్పటి నుంచి ‘ఈ సాలా కప్ నమ్‌దూ’ అనండి’ అని స్మృతి మంధాన అన్నారు.