NTV Telugu Site icon

WPL 2023: విమెన్స్ ఐపీఎల్ తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్యే!

Ipl

Ipl

గత 15 ఏళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమెన్స్ ఐపీఎల్ కోసం చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. అది ఇప్పటికి నిజం కాబోతుంది. ఈ ఏడాది తొలిసారిగా విమెన్స్ లీగ్‌ జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబందించిన ఫ్రాంచైజీల్ని ప్రకటించిన పాలకమండలి.. మెగావేలం, వేదికలు, షెడ్యుల్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 4న డీవై పాటిల్ స్టేడియంలో ముంబై, అహ్మదాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్‌ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఈ విమెన్స్‌ లీగ్‌ మొత్తం మ్యాచ్‌లు ముంబైలోని డీవై పాటిల్‌తో పాటు బ్రబౌర్న్ స్టేడియాల్లో జరగనున్నట్లు సమాచారం. ప్రధాన స్టేడియం వాంఖడే కూడా ఉన్నా.. మార్చి 17న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. దీంతో కేవలం ఆ రెండు మైదానాల్లోనే పూర్తి లీగ్‌ నిర్వహించబోతున్నారట.

ఇక, రెండో మ్యాచ్‌ మార్చి 5న బెంగళూరు-ఢిల్లీ మధ్య బ్రబౌర్న్ వేదికగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ లీగ్ తుదిపోరు మార్చి 26న డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఇక రెండు, మూడు ప్లేస్‌ల్లో నిలిచిన రెండు జట్లు మార్చి 24న సీసీఐ బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది.

ఆటగాళ్ల వేలం ఆరోజునే..

ఈ మెగావేలం ముంబైలోని ఓ హోటల్‌లో ఫిబ్రవరి 13న జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. భారత్-న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టీ20కి హాజరైన ఆయన ఈ విషయమై ఓ మీడియాతో మాట్లాడారు. “సౌత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఫిబ్రవరి 13న ప్లేయర్ ఆక్షన్ జరగనుంది. డేట్, ప్లేస్‌పై ఫ్రాంచైజీలు సౌకర్యంగా ఉన్నాయి. ఈ డేట్‌లో వేలం నిర్వహణ కోసం ఫ్రాంచైజీలకు కబురు పంపాం. దానికి తగినట్లు ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవాలని సూచించాం. ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి 13 అనుకుంటున్నాం. ఇది కొత్త లీగ్‌ కాబట్టి గ్రౌండ్ వర్క్ బాగా జరగాల్సి ఉంటుంది. ప్రతి ప్లేయర్‌ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది” అని చెప్పారు. మహిళా ఐపీఎల్ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు జట్లు కలిసి మొత్తం 100-120 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

Also Read: Viral Video: రోటీ చేసిన బిలియనీర్.. బ్లాగర్‌తో కలిసి బిల్‌గేట్స్ చెఫ్ అవతారం