NTV Telugu Site icon

Shiva Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం.. నేడే ప్రారంభం

Shiva Statue

Shiva Statue

Shiva Statue: రాజస్థాన్‌లోని రాజసమంద్‌ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కైలాసనాథుడి విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్నారు. విశ్వాస్‌ స్వరూపంగా పేర్కొన్ని ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించనున్నారు. ఈ విగ్రహం ఉదయ్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది. విగ్రహ ప్రారంభోత్సవ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని(369 అడుగులు) తత్ పదం సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం నేటి నుంచి 9 రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ 9 రోజుల కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్త మొరారీ బాపు రామ్‌ కథను పఠిస్తారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. అత్యంత ఎత్తైన మహాశివుడి విగ్రహాన్ని నిర్మించేందుకు 3 వేల టన్నుల స్టీల్‌ వినియోగించారు. అలాగే, 2.5లక్షల క్యూబిక్‌ టన్నుల కాంక్రీట్‌, ఇసుకను వాడారు. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు పదేళ్ల సమయం పట్టింది. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్‌ గహ్లోత్‌, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు. కొండపైన ప్రతిష్టించబడిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో రూపొందించబడింది. ఈ విగ్రహం 20 కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలిగించడంతో రాత్రిపూట కూడా ఈ విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే సామర్థ్యంతో నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్‌ టన్నెల్‌ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు.

Preganent Women: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కోమాలో ఉన్న మహిళ

ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహమని, లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించామని ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయని ఈ ప్రోగ్రామ్‌ అధికార ప్రతినిధి జైప్రకాశ్‌ మాలి అన్నారు. విద్యుత్‌ కాంతుల్లో రాత్రి పూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుందని మాలి పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతంలో బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్, ఫుడ్‌ కోర్టులు, అడ్వెంచర్‌ పార్కు, జంగిల్‌ కేఫ్‌ వంటి వాటిని ఏర్పాటు చేశారు.

Show comments