Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. శనివారం రాత్రి రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై 200 కి పైగా డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈ దాడులతో ఉక్రెయిన్‌లోని సుమీ, ఖార్కివ్, డ్నిప్రో, జపోరిజ్జియా, ఖ్మెల్నిట్స్కీ, ఒడెస్సా ప్రావిన్సులలో గణనీయమైన నష్టం వాటిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని ఇద్దరు పౌరులు మరణించగా, పది మందికి పైగా గాయపడ్డారు. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.
READ ALSO: Gaza Crisis: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరాలి.. భారత్‌కు ట్రంప్ ఆహ్వానం..!
ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఈ ఘోరమైన దాడుల వల్ల దేశ ఇంధన వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని, అనేక నగరాల్లో విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. చలి తీవ్రత, కఠినమైన వాతావరణం మధ్య మరమ్మతు బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రష్యన్ దాడుల తర్వాత ఇంధన రంగాన్ని పునరుద్ధరించడంలో పాల్గొన్న వారందరికీ, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పనులు చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.
గత ఏడు రోజుల్లో రష్యా 1,300 కంటే ఎక్కువ డ్రోన్ అటాక్‌లను, దాదాపు 1,050 గైడెడ్ ఏరియల్ బాంబులను, వివిధ రకాల 29 క్షిపణులను ప్రయోగించిందని అన్నారు. ఉక్రెయిన్‌కు మరింత భద్రత అవసరమని జెలెన్స్కీ ఈ సందర్భంగా హెచ్చరించాడు. ముఖ్యంగా ఈ వైమానిక దాడులను ఎదుర్కోవడానికి వైమానిక రక్షణ వ్యవస్థల కోసం మరిన్ని క్షిపణులను అందించాలని కోరాడు. రష్యా ఉద్దేశపూర్వకంగా దౌత్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంటే, అంతర్జాతీయ సమాజం నిర్ణయాత్మకంగా స్పందించాలని ఉక్రెయిన్ కోరింది. ఈ క్లిష్ట సమయంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన, భద్రతను పునరుద్ధరించడానికి కలిసి పని చేస్తున్న అన్ని మిత్రదేశాలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
READ ALSO: Diabetes Skin Symptoms: మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా?
