Site icon NTV Telugu

OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..

Pakistan Oic Kashmir

Pakistan Oic Kashmir

OIC Kashmir Meeting: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో కాశ్మీర్‌పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కాంటాక్ట్ గ్రూప్ సమావేశమైంది. ఈ సమావేశంలో అజర్‌బైజాన్, పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, నైజర్ దేశాల విదేశాంగ మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి OIC సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహ్మిమ్ తహా అధ్యక్షత వహించారు. ఇందులో కాశ్మీరీ ప్రతినిధి బృందం కూడా పాల్గొన్నారు. భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ, భద్రతా పరిస్థితిని వారి సమావేశంలో సమీక్షించినట్లు సమాచారం. కాశ్మీర్ అంశంపై ఈ దేశాల వాదన ఏంటి, ఈ సమావేశంపై భారత్ స్పందన ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం..

READ ALSO: Harish Rao : కాళ్లు కట్టేసి లాఠీలతో బాదడమేనా.. ప్రజాస్వామ్యమా.?

సమావేశంలో కాశ్మీర్ అంశంపై చర్చ..
పాకిస్థాన్ ప్రధానమంత్రి విదేశాంగ శాఖ ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి మాట్లాడుతూ.. దక్షిణాసియాలో శాశ్వత శాంతి కాశ్మీర్ వివాద పరిష్కారంతో ముడిపడి ఉందని అన్నారు. వెంటనే రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతదేశంపై నిర్మాణాత్మక ఒత్తిడి తీసుకురావాలని ఆయన OICని కోరారు. భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణను OIC స్వాగతించింది. కాశ్మీర్ సమస్య పరిష్కారం లేకుండా ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి కష్టమని ఇటీవలి సంఘటనలు చూపిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ప్రాంతీయ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తుందని సమావేశం వాళ్లు అన్నారు. సమావేశంలో OIC రాజకీయ కార్యకర్తలు, మానవ హక్కుల పరిరక్షకులను పెద్ద ఎత్తున అరెస్టు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీనగర్‌లోని జామియా మసీదు, ఈద్గా వద్ద మతపరమైన సమావేశాలపై విధించిన ఆంక్షలను అన్యాయమని ఖండించింది.

టర్కీ అధ్యక్షుడికి భారత్ కౌంటర్..
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదిక నుంచి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం – పాకిస్థాన్ మధ్య చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని ముస్లిం సోదర సోదరీమణుల కోసం, ఈ సమస్యను UN భద్రతా మండలి సహాయంతో పరిష్కరించాలని అన్నారు. ఆయన గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను భారతదేశం తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత అంతర్గత విషయం అని ఇండియా పేర్కొంది.

READ ALSO: GST 2.0 Complaint Process: ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే.. ఈ పని చేయండి

Exit mobile version