Biggest iPhone in the World: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ‘ఐఫోన్’లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. సోమవారం (సెప్టెంబర్ 9)న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ‘ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్’ టాప్ ఎండ్ మోడల్. దీని స్క్రీన్ 6.7 అంగుళాలు. అయితే ఈ ఫోన్ కంటే బిగ్గెస్ట్ ఐఫోన్ ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ బిగ్గెస్ట్ ఐఫోన్‌ను రూపొందించాడు.
6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రతిరూపాన్ని అరుణ్ మైనీ రూపొందించాడు. ‘మాథ్యూ పెర్క్స్’ అనే గ్యాడ్జెట్ స్పెషలిస్ట్‌తో కలిసి ఈ భారీ ఐఫోన్ రూపాన్ని అతడు తయారు చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మిస్టర్ హూజ్‌ద బాస్’ పేరిట టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ యూట్యూబ్‌లో అరుణ్ పేరుపొందాడు.
బిగ్గెస్ట్ ఐఫోన్‌ను స్టాండ్‌పై అమర్చి స్థానిక బ్రిటన్ వీధుల్లోకి అరుణ్ మైనీ తీసుకెళ్లగా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు దగ్గరకు వచ్చి చూశారు. బిగ్గెస్ట్ ఐఫోన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఐఫోన్‌లో సులభంగా స్క్రోల్ చేయగలగడం, టెక్స్ట్‌లు మరియు ఇమెయిల్‌లను పంపడం చేయొచ్చు. సాధారణ ఫోన్‌లో ఉండే అన్ని యాప్‌లను ఉపయోగించొచ్చు. గతంలో అమెరికాకు చెందిన మాథ్యూ బీమ్, జెడ్‌హెచ్‌సీ అనే యూట్యూబర్లు భారీ ఐఫోన్‌లను రూపొందించారు.