2025 మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 339 పరుగులను భారత్ మరో 9 బంతులుండగానే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. జెమీమా అజేయ సెంచరీ (127) చేయగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (89) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించనుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, భారత్ జట్లు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఈ రెండు టీమ్స్ ఫైనల్‌లో చోటు దక్కించుకోవడమే కాకుండా.. కోట్ల రూపాయల ప్రైజ్ మనీని కూడా పొందనున్నాయి.
భారత మహిళా జట్టు ఇప్పటికే 20 కోట్ల రూపాయలు (19,85,39,040 రూపాయలు)లను కచ్చితంగా పొందనుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడిస్తే.. ప్రపంచకప్ కల నెరవేరడమే కాకుండా, సుమారు 40 కోట్ల రూపాయలు (39,70,91,520 రూపాయలు) బహుమతిగా పొందుతుంది. 2025 మహిళల ప్రపంచకప్ రన్నరప్ ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు కాగా.. విజేతకు రూ.40 కోట్లు దక్కుతుంది. గతంతో పోల్చితే.. ఈ ప్రైజ్‌మనీ చాలా చాలా ఎక్కువ. ప్రస్తుతం పురుష, మహిళల జట్లు సమానంగా ప్రైజ్‌మనీ అందుకుంటున్నాయి. ఈ ప్రపంచకప్ కోసం ప్రైజ్‌మనీని ఐసీసీ రికార్డు పెంచింది. ఈ టోర్నమెంట్ కోసం మొత్తం ప్రైజ్‌మనీని US$13.88 మిలియన్లు (116 కోట్లు)గా నిర్ణయించారు. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ఎడిషన్‌తో పోలిస్తే ఇది 297 శాతం పెరుగుదల. అప్పుడు మొత్తం ప్రైజ్‌మనీ 3.5 మిలియన్లు.
Also Read: Koti Deepotsavam 2025: సిద్దమా.. రేపటి నుంచే హైదరాబాద్‌లో ‘కోటిదీపోత్సవం’!
2025 మహిళల ప్రపంచకప్ గెలిచిన జట్టుకు $4.48 మిలియన్లు (రూ.39.7 కోట్లు), రన్నరప్ జట్టుకు $2.24 మిలియన్లు (రూ.19.8 కోట్లు) దక్కనున్నాయి. సెమీఫైనల్‌లో ఓడిపోయిన రెండు జట్లకు $1.12 మిలియన్లు (రూ.9.9 కోట్లు) అందుతాయి. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లలో ఓడిపోయిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు చెరో రూ.10 కోట్లు అందుకుంటాయి. గ్రూప్ దశలో పాల్గొనే ప్రతి జట్టుకు $250,000 (సుమారు రూ. 2.2 కోట్లు) బహుమతిగా ఇవ్వబడుతుంది. అదనంగా గెలిచిన ప్రతి గ్రూప్ మ్యాచ్‌కు $34,314 (సుమారు రూ. 28.8 లక్షలు) అందుతాయి. ఐదవ, ఆరవ స్థానంలో నిలిచిన జట్లకు $700,000 (సుమారు రూ. 6.1 కోట్లు).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లకు $2.800,000 (సుమారు రూ. 2.4 కోట్లు) బహుమతిగా ఇవ్వబడుతుంది.
