సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ బోణీ కొట్టింది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లకు 269 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని 271 పరుగులకు సవరించగా.. శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్.. తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం (అక్టోబర్ 5) దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ 2025 ట్రోఫీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (8) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (37; 59 బంతుల్లో 3×4, 1×6), హర్లీన్ డియోల్ (48; 64 బంతుల్లో 6×4) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 19 ఓవర్లకు 81/1తో భారత్ మంచి స్థితిలో నిలిచింది. వెంటనే ప్రతీక అవుట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (21)తో క్రీజులో కుదురుకోవడంతో భారత్ 25 ఓవర్లకు 120/2 స్కోర్ చేసింది. లంక బౌలర్ ఇనోక ఒకే ఓవర్లో మూడు వికెట్స్ పడగొట్టి షాక్ ఇచ్చింది. తర్వాతి ఓవర్లో రిచా ఘోష్ (2) కూడా ఔటైపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అమన్‌జ్యోత్ కౌర్ (57; 56 బంతుల్లో 5×4, 1×6), దీప్తి శర్మ (53; 53 బంతుల్లో 3×4), స్నేహ్ రాణా (28 నాటౌట్; 15 బంతుల్లో 2×4, 2×6)లు ఆదుకోవడంలో భారత్ భారీ స్కోర్ చేసింది.
Also Read: Asia Cup 2025: చర్చించడానికి ఏమీ లేదు, ట్రోఫీ మాదే.. పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం!
ఛేదనలో శ్రీలంక బాగానే ఆడింది. ఓపెనర్ హాసిని (14) ఎక్కువసేపు నిలవకపోయినా.. చమరి ఆటపట్టు (43), హర్షిత (29) ఇనింగ్స్ చక్కదిద్దారు. దీంతో లంక 82/1తో పటిష్ట స్థితికి చేరుకుంది. దాంతో లంక సునాయాస విజయం సాదిస్తుందేమో అని అనుకున్నారు. స్పిన్నర్ల రాకతో లంక తడబడింది. బ్యాటింగ్‌లో సత్తాచాటిన దీప్తి.. బౌలింగ్‌లోనూ రాణించింది. శ్రీచరణి, స్నేహ్ సైతం విజృంభించారు. దాంతో లంక స్వల్ప వ్యవధిలో కీలక వికెట్స్ కోల్పోయింది. నీలాక్షి (35) పోరాడినా.. ఆమెకు సహకారం అందించేవారు కరువయ్యారు. దాంతో లంకకు ఓటమి తప్పలేదు. లంకపై తడబడి నిలిచిన భారత్.. పాకిస్థాన్‌పై ఇక ఆడుతుందో చూడాలి.
