కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!

  • డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ పెంపు..
  • కొత్త రేట్లు ఆగస్టు 3 నుంచి అమల్లోకి..
  • డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్ లీటర్‌కు రూ.15.5 నుంచి రూ.25.5కు పెంపు..
  • పెట్రోల్ ఎగుమతులపై సుంకం రూ.2.5 నుంచి రూ.3.5కు పెంపు..
  • ATF (జెట్ ఇంధనం)పై విండ్‌ఫాల్ ట్యాక్స్ రూ.14.5 నుంచి రూ.22కు పెంపు..
Windfall Tax

Windfall Tax

Windfall Tax Hiked: అంతర్జాతీయ ముడి చమురు (Crude Oil) ధరల్లో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) లేదా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ (Windfall Tax)ను మరోసారి పెంచింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.15.5 నుంచి రూ.25.5కు పెంచారు. అంటే ఒక్కసారిగా రూ.10 పెంపు చేశారు. అలాగే పెట్రోల్ ఎగుమతులపై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.2.5 నుంచి రూ.3.5కు పెంచారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఇంధనంపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.14.5 నుంచి రూ.22కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పశ్చిమ ఆసియా (West Asia)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. దీంతో ఇంధన ఎగుమతులపై కంపెనీలకు లాభాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్, ATF అందుబాటును మెరుగుపరచడం, అధిక ఎగుమతులను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచినట్లు తెలిపింది.

ఇదివరకు జూలై 16న కూడా కేంద్ర ప్రభుత్వం కూడా విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో మార్పులు చేసింది. అప్పుడు డీజిల్‌పై ట్యాక్స్‌ను రూ.15.5కు పెంచింది. ATFపై రూ.14.5కు పెంచింది. ఇంకా పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని రూ.2.5కు తగ్గించింది.అంతకుముందు జరిగిన సవరణలో పెట్రోల్‌పై ట్యాక్స్‌ను రూ.4కు పెంచగా.. డీజిల్‌పై విధించే సుంకాన్ని తగ్గించారు. అలాగే ATFపై కూడా ట్యాక్స్‌లో మార్పులు చేశారు.