Sanju Samson, Ishan Kishan and Hardik Pandya Help India won by 200 runs vs West Indies: ప్రయోగాలు చేసి రెండో వన్డేలో ఓడిన భారత్.. మంగళవారం జరిగిన మూడో వన్డేలో మాత్రం వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 352 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. గుడాకేష్ మోటీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో అథనేజ్ (32), అల్జారీ జోసెఫ్ (26), కరియా (19) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4/37) నాలుగు వికెట్స్ పడగొట్టగా.. ముకేశ్ కుమార్ (3/30) మూడు వికెట్స్ తీశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు (351/5) చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (77; 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. మొదటి రెండు వన్డేల్లో తేలిపోయిన శుభ్‌మన్ గిల్ (85; 92 బంతుల్లో 11 ఫోర్లు) కూడా భారీ ఇన్నింగ్స్‌ఆడాడు. సంజు శాంసన్ (51; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (70; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.సూర్యకుమార్ యాదవ్ (35) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ 2 వికెట్స్ పడగొట్టగా.. కరియా, జోసెఫ్, మోటీ ఒక్కో వికెట్ పడగొట్టారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడకున్నా.. యువ ఆటగాళ్లు 300లకు పైగా స్కోర్ చేశారు.
Also Read: Gold Today Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ముకేశ్ కుమార్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లో బ్రెండన్ కింగ్ (0)ను క్యాచ్ ఔట్ చేసిన ముకేశ్.. తర్వాతి ఓవర్‌లో కైల్ మేయర్స్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. షై హోప్ (5)ను కూడా ఔట్ చేసి విండీస్‌ను దెబ్బ కొట్టాడు. కార్టీ (6)ని ఉనద్కత్.. హెట్‌మయర్ (4)ను శార్దూల్ ఔట్ చేశాడు. షెఫర్డ్ (8) శార్దూల్ ఔట్ చేయడంతో విండీస్ 50 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో పడింది. అథనేజ్, కరియాలను కుల్దీప్ వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో విండీస్ 88 పరుగులకే 8 వికెట్స్ కోల్పోయి 100 లోపే ఆలౌటయ్యేలా కనిపించింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో విండీస్ స్కోరు 150 దాటింది. జోసెఫ్, సీల్స్ (1) శార్దూల్ ఔట్ చేయడంతో విండీస్ ఆలౌటైంది. సిరీస్‌లోని మూడు వన్డేల్లోనూ అర్ధ సెంచరీలు (184 పరుగులు) చేసిన ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు అందుకున్నాడు.
Also Read: Uttarakhand: దారుణం.. మహిళను కొరికి హత్య చేసి, ఆపై అత్యాచారం..