NTV Telugu Site icon

Khushbu: సినీ నటి ఖుష్బూ సీరియస్‌.. సీఎం స్టాలిన్‌ మౌనంగా ఉంటే అర్థం ఏంటి?

Khushbu Sunder

Khushbu Sunder

Khushbu: డీఎంకే నేత సైదాయ్ సాదిక్‌ రాజకీయ నేతలుగా మారిన నటీమణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరుస్తూ సాదిక్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించాలని సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆమె చాలా సీరియస్‌ అయ్యారు. బీజేపీ కొనసాగుతున్న సినీ తారలు ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రి రఘురామ్‌లను ‘రాజకీయాల్లోకి వచ్చిన ఐటమ్‌లు.. అందులో ఖుష్బూ పెద్ద ఐటమ్” అంటూ సైదాయ్‌ సాదిక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల డీఎంకే పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కనిమొళి క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇంతగా దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఖుష్బూ ప్రశ్నించారు. దీనికి అర్థమేంటని ప్రశ్నించారు. స్టాలిన్‌ తనకు ఈ విషయంలో అండగా నిలబడాలని కోరుకుంటున్నానన్నారు. సైదాయ్‌ సాదిక్‌పై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతానని.. ఆయనను పార్టీ నుంచి తొలగించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Nancy Pelosi: నాన్సీ పెలోసీ ఇంట్లో ఆగంతుకుడి కలకలం.. ఆమె భర్తపై దాడి

అలాంటి నాయకుడిని పార్టీ నుంచి తక్షణమే స​స్పెండ్‌ చేయడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఖుష్బూ నిలదీశారు. తన పరువు, గౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతానని గట్టిగా నొక్కి చెప్పారు. మా పార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సీఎం స్టాలిన్‌ మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. తనకు 22, 19 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటున్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్లు ఏమనుకుంటారని ఖుష్బూ అన్నారు. ఖుష్బూ ఎన్సీపీ ఎంపీ సుప్రీయ సూలేను రాజకీయాలు విడిచిపెట్టి వంటగదిలో పని చేయమంటూ విమర్శించిన సందర్భం గురించి ప్రస్తావిస్తూ…తాను ఆ సమయంలో సుప్రీయకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. అటు, ఐటెంలు అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే నేత సైదాయ్ సిద్ధికి క్షమాపణలు తెలిపారు. ఎవరి మనోభావాలూ గాయపర్చాలని తాను వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే, బీజేపీ నాయకత్వం చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఎవరూ ఎందుకు స్పందించరని సిద్ధికి ప్రశ్నించారు.