Arvind Kejriwal: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, చైనాతో భారత్ తన వ్యాపారాన్ని ఎందుకు ఆపడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రశ్నించారు. ఆయన ఈ ప్రశ్నను ట్విట్టర్ వేదికగా హిందీలో సంధించారు. “చైనాతో మన వాణిజ్యాన్ని మనం ఎందుకు ఆపకూడదు? చైనా నుండి దిగుమతి చేసుకునే చాలా వస్తువులు భారతదేశంలోనే తయారవుతాయి. తద్వారా చైనా గుణపాఠం పొందుతుంది. భారతదేశంలో ఉద్యోగాలు వస్తాయి” అని కేజ్రీవాల్ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో రాశారు. .
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఎ) చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుందని మంగళవారం నాడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు.
हम चीन से अपना व्यापार क्यों नहीं बंद करते?
चीन से आयात की जाने वाली अधिकतर वस्तुयें भारत में बनती हैं। इस से चीन को सबक़ मिलेगा और भारत में रोज़गार
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2022
ఇదిలా ఉండగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తోంది. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే, 1962లో జరిగిన చైనా యుద్ధంపై దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారత్‌పై లోక్‌సభలో చర్చకు అనుమతించారని.. ఇండో-చైనా సరిహద్దు పరిస్థితిపై చర్చ జరగాలని కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. తాము భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తున్నామని, 1962లో, భారతదేశం-చైనా యుద్ధం జరిగినప్పుడు, జవహర్‌లాల్ నెహ్రూ ఈ సభలో 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారని.. ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.
5G Services: ఢిల్లీ, ముంబై సహా 50 పట్టణాల్లో 5జీ సేవలు.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి
ఈ ఉదంతంపై సమగ్ర చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో రాజ్యసభ నుంచి బుధవారం 17 విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. తొలుత సభ ప్రారంభం కాగానే డిసెంబర్ 9న భారత్, చైనా సేనల ముఖాముఖిపై సవివర చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. చర్చకు ప్రభుత్వం అనుమతించనందుకు నిరసనగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా సభ నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు లోక్‌సభలోనూ తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. సరిహద్దులో చైనా దురాక్రమణపై సమగ్ర చర్చ జరగాలని కోరుతున్నామని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు. సరిహద్దులో చైనా అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జిలు, నివాసాలపై రక్షణ మంత్రి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదాలు చేయడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
