NTV Telugu Site icon

Gaganyaan Test Flight: చివరి నిమిషంలో నిలిచిపోయిన గ‌గ‌న్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన..

Tv D1

Tv D1

Gaganyaan Test Flight: గ‌గ‌న్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం వాయిదా పడింది.. చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది ఇస్రో.. గ‌గ‌న్‌యాన్ మిష‌న్ రాకెట్ ఇంజిన్‌లో లోపం త‌లెత్తడంతో ఆ ప్రయోగాన్ని వాయిదా వేశారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం టీవీ-డీ1 ప్రయోగించాల్సి ఉన్నా.. మొదట ఆ ప్రయోగాన్ని ఉదయం 8.30 గంటలకు వాయిదా వేసింది ఇస్రో.. ఆ తర్వాత ఉదయం 8.45 గంటలకు వాయిదా పడింది.. కానీ, ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్‌లో లోపం ఉన్నట్లు కంప్యూట‌ర్లు చెప్పడంతో ఆ ప‌రీక్షను చివరి క్షణాల్లో ఇస్రో వాయిదా వేసింది. కౌంట్ డౌన్ కు 5 సెకండ్ల ముందు ఈ ప్రయోగాన్ని ఆపేశారు. సాంకేతిక సమస్యను పరిశీలించే పనిలో పడిపోయారు శాస్త్రవేత్తలు.

మొత్తంగా ఇస్రో చేపట్టిన గగన్ యాన్ క్రూ మాడ్యూల్ లో సాంకేతిక లోపాన్ని శాస్త్ర వేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి 5 సెకండ్ల ముందు ప్రయోగం ఆపాలని కంప్యూటర్‌కు ఆదేశాలు వెళ్లాయి.. దీంతో. ప్రయోగం వాయిదా పడింది.. భూమి నుంచి 17 కిలో మీటర్ల ఎత్తుకు వెళ్లి కిందకు రావాల్సిన క్రూ మాడ్యూల్‌ను రద్దు చేశారు.. సాంకేతిక సమస్యపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చర్చలు జరిపి.. ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.. లోపాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు..

ఇక, ప్రయోగం వాయిదపై ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ మాట్లాడుతూ.. అనుకున్న విధంగా ఈరోజు ప్రయోగాన్ని చేయలేకపోయాం.. వాతావరణంలో మార్పుల వల్ల ప్రయోగాన్ని 8 గంటల 45 నిమిషాలకు వాయిదా వేశాం.. కానీ, సాంకేతికలోపం వల్ల ప్రయోగాన్ని నిలిపివేశాం అన్నారు. అయితే, రాకెట్ సురక్షితంగానే ఉంది.. సాంకేతిక సమస్యలను గుర్తించే ప్రక్రియలో నిమగ్నమయ్యాం అని వివరించారు.. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం.. అన్నీ విశ్లేషించిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం.. త్వరలోనే మళ్లీ ప్రయోగం చేస్తాం అని ప్రకటించారు ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్.

Show comments