NTV Telugu Site icon

China Drilling: భూగర్భంలోకి 10000 మీటర్ల లోతైన రంధ్రాన్ని తవ్వుతున్న చైనా.. ఏం చేయబోతున్నారు?

China Drilling

China Drilling

China Drilling: ఎప్పుడూ ఏదో ఒక భారీ ప్రయోగం చేసే చైనా.. ఒకే రోజు రెండు భారీ సైన్సు ప్రాజెక్టులను ప్రారంభించింది. మంగళవారం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగా.. మరోవైపు షింజియాంగ్‌ ప్రావిన్స్‌లో అత్యంత లోతైన బోర్‌ తవ్వకానికి శ్రీకారం చుట్టింది. ఈ బోర్‌ లోతు 10,000 మీటర్లు ఉండనుంది. చైనా శాస్త్రవేత్తలు భూపొర‌ల‌ లోతుల్లోకి భారీ రంద్రం తవ్వడం మొదలుపెట్టారు. భూగర్భంలోకి 10,000 మీటర్లు (32,808 అడుగులు) రంధ్రం చేయనున్నారు. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఈ రంద్రం తవ్వే ప్రక్రియ చేపట్టారు. భూగర్భ అన్వేషణలో భాగంగా చైనా శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ.. జిన్హువా న్యూస్ వివరాలు వెల్లడించింది. అత్యంత లోతైన బోర్‌హోల్ కోసం డ్రిల్లింగ్‌ మంగళవారం దేశంలోని చమురు సంపన్న జిన్‌జియాంగ్ ప్రాంతంలో ప్రారంభమైందని తెలిపింది. చైనా చేస్తున్న డ్రిల్లింగ్ ప‌ని.. దాదాపు ప‌ది ఖండాల భూభాగాన్ని చీల్చుకుంటూ వెళ్లగ‌ల‌దు. భూభాగంలోని క్రేటేసియ‌స్ పొర‌ను ఆ హోల్ చేరుకుంటుంద‌ని భావిస్తున్నారు. అక్కడ సుమారు 145 మిలియ‌న్ల క్రితం ఏర్పడిన రాళ్లు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే ఈ డ్రిల్లింగ్ ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ‘‘డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ కష్టాన్ని రెండు సన్నని స్టీల్ కేబుల్స్‌పై డ్రైవింగ్ చేసే పెద్ద ట్రక్కుతో పోల్చవచ్చు’’ అని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని శాస్త్రవేత్త సన్ జిన్‌షెంగ్ అన్నారు. ఇక, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 2021లో దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. లోతైన భూమి అన్వేషణలో మరింత పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రక్రియ ఖనిజ, శక్తి వనరులను గుర్తించగలదని.. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి పర్యావరణ విపత్తుల ప్రమాదాలను అంచనా వేయడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వ‌ర‌కు బోర్‌హోల్‌లో అతి పెద్ద రంధ్రాన్ని ర‌ష్యా తవ్వింది. కోలా సూప‌ర్‌డీప్ బోర్‌హోల్ దాదాపు 12 వేల మీట‌ర్ల లోతు ఉంటుంది. అంటే అది దాదాపు 40వేల ఫీట్ల లోతు అన్నమాట‌. 1989లో ఆ హోల్ చేశారు. దాన్ని డ్రిల్ చేసేందుకు 20 ఏళ్లు స‌మ‌యం ప‌ట్టింది.

Read Also: Wrestling Body Chief: పతకాలు నిమజ్జనం చేస్తే న్యాయం జరగదు.. రుజువు కావాలి..

మరో వైపు అదే సమయంలో చైనా విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపింది. వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో కూడా ఉన్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని తమ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించడం విశేషం. ఇది చైనా అంతరిక్ష కార్యక్రమంలో కీలక ముందడుగు. ముగ్గురు వ్యోమగాములు షెంజౌ-16 వ్యోమనౌకలో రోదసిలోకి పయనమయ్యారు. లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ దీన్ని మోసుకెళ్లింది. ముగ్గురు వ్యోమగాయులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని.. ప్రయోగం విజయవంతమైందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్‌ఏ) పేర్కొంది. దీంతో చైనా భూమి ఉపరితలం పైన, దిగువన కొత్త సరిహద్దులను ఒకే సమయంలో అన్వేషిస్తున్నట్టు అయింది.