Gold Medal Winner Navdeep Singh Meets PM Modi: పారిస్ పారాలింపిక్స్ 2024లో పతకం గెలిచిన భారత అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో భారత పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని.. వారితో సరదాగా ముచ్చటించారు. అథ్లెట్ జీవాంజి దీప్తి, షూటర్ అవని లేఖరా, జూడో అథ్లెట్ కపిల్ పర్మార్, ఆర్చర్ శీతల్ దేవి, డిస్కస్ త్రోయర్ యోగేశ్, జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్ సహా మరికొందరు ప్రధానిని కలిశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ, భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా కూడా తదితరులు పారాలింపియన్లను కలిశారు.
జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ ప్రధాని మోడీకి టోపీ బహూకరించాడు. నవ్‌దీప్ మరుగుజ్జు కావడంతో ప్రధాని కింద కూర్చుని టోపీని తీసుకుని కాసేపు మాట్లాడారు. పారాలింపిక్స్‌లో త్రో విసిరిన తర్వాత ఎందుకు అంత కోపాన్ని ప్రదర్శించావ్ నవ్‌దీప్ అని ప్రధాని అడిగారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాను. ఈసారి మీకు మాటిచ్చినట్టుగానే.. మెడల్ గెలుచుకున్నాను. ఆ భావోద్వేగంలో అలా చేశాను’ అని నవ్‌దీప్ బదులిచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్.. సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ సదేగ్‌పై అనర్హత వేటు పడడంతో గోల్డ్ మెడల్ నవదీప్ సొంతమైంది.
Also Read: Gurucharan Dies: టాలీవుడ్‌లో విషాదం.. పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత!
రెండు చేతుల్లేని పారా ఆర్చర్ శీతల్ దేవి కాలితో సంతకం చేసిన జెర్సీని ప్రధాని మోడీకి అందించింది. అథ్లెట్ కపిల్ పర్మార్ తన కాంస్య పతకంపై ప్రధాని సంతకాన్ని తీసుకున్నాడు. ఇక పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 29 పతకాలు గెలుచుకుంది. పారాలింపిక్స్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. పారిస్‌లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.