NTV Telugu Site icon

Champions Trophy 2025: పాకిస్థాన్‌ ఎందుకు రావట్లేదు.. అభిమానికి బదులిచ్చిన సూర్యకుమార్!

Suryakumar Yadav Pakistan Fan

Suryakumar Yadav Pakistan Fan

ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 పైనే ఉంది. ట్రోఫీ జరుగుతుందా?, జరిగితే వేదిక ఎక్కడ? అని చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా.. పాక్‌కు భారత జట్టును పంపబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్‌లో జరపాలని పీసీబీని ఐసీసీ కోరింది. హైబ్రిడ్ విధానంలో భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీకి ఐసీసీ సూచించింది. హైబ్రిడ్‌ మోడల్‌లో జరిగినా.. ఆతిథ్య ఫీజును పూర్తిగా చెల్లిస్తామని పాక్ క్రికెట్‌ బోర్డుకు ఐసీసీ చెప్పినట్లు తెలుస్తోంది. అయినా పాకిస్తాన్ అందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. పాక్ టోర్నీ నుంచి తప్పుకుంటుందని, ఛాంపియన్స్‌ ట్రోఫీ దక్షిణాఫ్రికాలో జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Gold Rate Today: మగువలకు ‘బంగారం’ లాంటి వార్త.. తులంపై 1500 తగ్గింది!

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గురించి టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. భారత ఆటగాళ్లతో కలిసి సూర్య తాజాగా బయటకు వెళ్లాడు. పాక్‌కు చెందిన ఓ అభిమాని సూర్యను కలిశాడు. ‘ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం మీరు పాకిస్థాన్‌కు ఎందుకు రావడం లేదు’ అని ప్రశ్నించాడు. ‘బ్రదర్.. ఈ విషయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదు’ అని ఆ అభిమానికి సూర్యకుమార్‌ సమాధానమిచ్చాడు. దాంతో ఆ అభిమాని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. నాలుగు టీ20 సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా చెరో మ్యాచ్ గెలిచాయి. బుధవారం సెంచురియన్లో మూడో మ్యాచ్ జరగనుంది.