Who is Abhijit Dipke: భారతీయ రాజకీయాలు అంటేనే మైండ్ గేమ్స్, డబ్బుల సంచులు, పైస్థాయిలో పలుకుబడులు.. ఇలాంటివే గుర్తొస్తాయి. ఇక ప్రజాసేవ, పరిపాలన అనేవి ఎప్పుడూ చివరి వరుసలో కనిపిస్తుంటాయి. అందుకేనేమో, ఈ కుళ్ళు రాజకీయాలు మనకెందుకులే అని నేటి యువత (జెన్ జీ) పాలిటిక్స్ అంటేనే ఆమడదూరం పారిపోతోంది. ఏదో పేపర్లలోనో, టీవీల్లోనో వచ్చే వార్తలను పెద్దవాళ్ళు ఆసక్తిగా గమనించడం తప్ప, యూత్ మాత్రం కేవలం సోషల్ మీడియా మీమ్స్‌కు, చిన్నపాటి అప్‌డేట్స్‌కు మాత్రమే పరిమితమైపోయింది. కానీ, గత రెండ్రోజుల నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. మన ఇండియన్ జెన్ జీ యూత్‌కు అకస్మాత్తుగా రాజకీయాలపై ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి ట్విట్టర్ ట్రెండ్స్ దాకా ఎక్కడ చూసినా పాలిటిక్స్ ముచ్చట్లే నడుస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఒక్కడే.. అతనే అభిజీత్ దీప్కే!
అభిజీత్ దీప్కే స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దేశంలో నిరుద్యోగ యువతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా ‘బొద్దింకలు’ (కాక్రోచెస్) తో పోల్చారనే వార్త వచ్చింది. వృత్తుల్లో, సమాజంలో చోటు కోసం నిరుద్యోగులు బొద్దింకల్లా కొట్టుకుంటున్నారు అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై యువత అలిగలేదు, పైగా ఆ కామెంట్‌ను నెత్తిన పెట్టుకుని ఓ సరికొత్త వ్యంగ్య (శాటైరికల్) రాజకీయ గ్రూప్‌గా మార్చేసింది. ఆ విధంగా పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ‘సోమరులు, నిరుద్యోగుల గొంతుక’ అని సగర్వంగా చెప్పుకునే ఈ పార్టీ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన రెండు రోజుల్లోనే ఏకంగా 40 వేల మందికి పైగా సభ్యులు చేరిపోయారంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్‌లు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీలో ‘సభ్యత్వం’ తీసేసుకున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ అకౌంట్ దుమ్మురేపుతోంది. ఏకంగా కోటికి పైగా ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది.
మరి ఇంతటి సంచలనం సృష్టించిన ఈ అభిజీత్ దీప్కే ఎవరు? అనే విషయాన్ని చాలా మంది యూత్ గమనించలేకపోతున్నారు! వాస్తవానికి అభిజీత్ ఓ పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. అంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేయాలి, పబ్లిక్ మెసేజింగ్ ఎలా ఉండాలి అనే విషయాల్లో నిపుణుడు. పూణేలో జర్నలిజం పూర్తి చేసిన అభిజీత్, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ యువకుడికి రాజకీయాలు కొత్తేమీ కాదు. 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేశాడు. ముఖ్యంగా 2020 ఫిబ్రవరిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఘనవిజయం సాధించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్ నడిపి, ఆన్‌లైన్ ద్వారా యువతను పార్టీ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు. అదే జోష్‌తో ఇప్పుడు 2026లో ఈ కాక్రోచ్ జనతా పార్టీని తెరపైకి తెచ్చాడు. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు.. ఢిల్లీ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించాడు. అక్టోబర్ 2019 నుంచి ఏప్రిల్ 2021 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) లో కమ్యూనికేషన్స్ ఫెలోగా పనిచేశాడు. ఆ తర్వాత జూన్ 2021 నుంచి మే 2024 వరకు ఢిల్లీ విద్యాశాఖకు కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా (సలహాదారుడిగా) కూడా సేవలు అందించాడు. అంతేకాదు.. ఇప్పుడు వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సైతం అమెరికా నుంచే నడిపిస్తున్నాడు.
ఎన్నికల బరిలో ఇంకా అధికారికంగా రిజిస్టర్ కాకపోయినా, ఈ పార్టీ మేనిఫెస్టో మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఇందులో ముఖ్యంగా ఐదు హామీలను ప్రకటించారు. మొదటిది.. సీజేపీ అధికారంలోకి వస్తే ఏ ప్రధాన న్యాయమూర్తికీ రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును నజరానాగా ఇవ్వరు. రెండోది.. సీజేపీ పాలిత రాష్ట్రమైనా, ప్రతిపక్ష రాష్ట్రమైనా సరే, ఎక్కడైనా ఒక్క అసలైన ఓటరు ఓటు డిలీట్ అయినా.. పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదంతో సమానం కాబట్టి సదరు ఎన్నికల సంఘాన్ని యూఏపీఏ (UAPA) చట్టం కింద అరెస్ట్ చేస్తారు. మూడోది.. మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. నాలుగోది.. బడా వ్యాపారవేత్తల చేతుల్లో ఉన్న అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తారు. ఇక ఐదోది.. ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే, వారు రాబోయే 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధిస్తారు.
భారతీయ రాజకీయ వ్యవస్థలో ఎప్పటినుంచో భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కొన్ని కీలక పార్టీలే దేశాన్ని ఎవరు ఏలాలో తేల్చుకుంటూ వస్తున్నాయి. జాతీయ స్థాయికి చేరాలని ఆరాటపడే మరికొన్ని ప్రాంతీయ పార్టీలూ ఉన్నాయి. అయితే ఈ రొటీన్ రాజకీయాలు చూసి బోర్ కొట్టిన యువతకు ఈ కొత్త కేండిడేట్ భలేగా నచ్చేసింది. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలంటే అర్హతలు ఏంటో తెలుసా? చాలా సింపుల్, బహుశా ఈ క్వాలిఫికేషన్స్ మీలో చాలా మందికి ఆల్రెడీ ఉండే ఉంటాయి. అవేంటంటే.. మొదటిది, బలవంతంగానో, కావాలనో లేదా ఒక సిద్ధాంతంగానో నిరుద్యోగి అయి ఉండాలి. రెండోది, ఒళ్ళు కదపడానికి బద్ధకంగా ఉన్నా బుర్ర మాత్రం నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. మూడోది, బాత్రూమ్ బ్రేకులతో కలిపి రోజుకు కనీసం 11 గంటల పాటు సోషల్ మీడియాలోనే గడుపుతూ క్రోనిక్‌లీ ఆన్‌లైన్‌లో ఉండాలి. నాలుగోది, మీరు పెట్టే పోస్టులు లేదా చేసే విమర్శలు పదునుగా, నిజాయితీగా, సమాజానికి పనికొచ్చే విధంగా ఉంటూ.. ప్రొఫెషనల్‌గా రచ్చ (రాంట్) చేయగలిగేలా ఉండాలి. మన దేశ రాజకీయ పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో, విరక్తితో ఉన్న భారతీయ యువతను రాజకీయాల వైపు నడిపించడానికి ఈ క్రేజీ పార్టీ ఒక అద్భుతమైన వేదిక అవుతుందని చాలా మంది భావిస్తున్నారు.
This Abhijeet Dipke, who started the “Cockroach Janta Party.”
Just see how “neutral” he really is. pic.twitter.com/e9cVo59awC
— Shimorekato (@iam_shimorekato) May 19, 2026
