Site icon NTV Telugu

VN Aditya: ఇక నా సినిమాలు రిలీజ్ చేయరా?.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై డైరెక్టర్ అసహనం!

Director Vn Aditya

Director Vn Aditya

Director VN Aditya Fires on People Media Factory: టాలీవుడ్ డైరెక్టర్ ‘వీఎన్ ఆదిత్య’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమా ‘మనసంతా నువ్వే’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనంతరం శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, బాస్, ఆట, రెయిన్ బో లాంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో నేనున్నాను భారీ హిట్ అవ్వగా.. బాస్, ఆట పర్వాలేదనిపించాయి. 2011 తర్వాత వీఎన్ ఆదిత్య హిట్ కొట్టనే లేదు. 2018లో ఓ ఇంగ్లీష్ సినిమా చేసినా.. అది రిలీజ్ అయిన విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన మూడు సినిమాలకు దర్శకత్వం వచించారు. అయితే ఆ సినిమాలు ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు.

లవ్ @ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు చిత్రాలను వీఎన్ ఆదిత్య తెరకెక్కించారు. ఈ మూడు సినిమాలు విడుదల కాకపోవడానికి కారణం ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అని వీఎన్ ఆదిత్య సోషల్ మీడియా మీడియాలో చెప్పారు. తన మూడు సినిమాలను విడుదల చేయకుండా.. గత నాలుగేళ్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జాప్యం చేస్తోందంటూ ఫేస్‌బుక్‌లో అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం, మా కాళి చిత్రాల గురించి చర్చిస్తున్నాం అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ ఫోటోను ఫేస్‌బుక్‌లో వేదికగా పంచుకుంది. ఈ నాలుగు చిత్రాల్లో మీరు ఏ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు? అని ఓ పోల్ పెట్టింది.

Also Read: Dinesh Karthik Coach: బిగ్ బ్రేకింగ్.. కోచ్‌గా దినేశ్‌ కార్తీక్‌!

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్న వీఎన్ ఆదిత్య.. తన సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అని ప్రశ్నించారు. ‘నా మూడు విలువైన, సెన్సిబుల్ సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని గత నాలుగేళ్లుగా ఎదరుచూస్తున్నా’ అని వీఎన్ ఆదిత్య రాసుకొచ్చారు. దీనికి నిర్మాతల పేర్లను ట్యాగ్ చేశారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక మూవీ రిలీజ్ చేయడానికి అవసరమైన అందరూ ఒకే ఫ్రేమ్ లో కూర్చున్నారు. కనీసం రిలీజ్ చేయాల్సిన నా మూడు సినిమాల గురించి ఒక మాటన్నా అనుకోవాలి కదా?. అరక్షణం డిస్కషన్ అది. నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా. ఇంక ఓపిక నశించి పబ్లిక్‌లో అడుగుతున్నా’ అని వీఎన్ ఆదిత్య ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఓ అన్నమయ్య కీర్తనను కూడా రాశారు. ఇక కార్తీకేయ 2, వెంకీ మామ, నిశ్శబ్దం, ఓ బేబీ, ధమకా చిత్రాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది.

Exit mobile version