WhatsApp End-to-End Encrypted Backup: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ (Whatsapp). వ్యక్తిగత చాట్స్ నుంచి ఆఫీస్ కమ్యూనికేషన్ వరకు.. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేయడం వరకు దాదాపు ప్రతి పనికీ వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. ఈ యాప్ లో పంపే సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. చాట్ బ్యాకప్‌లకు కూడా ప్రత్యేక భద్రత అవసరమని.
క్లౌడ్‌లోని బ్యాకప్‌లకు ప్రమాదం:
వాట్సాప్ చాట్స్‌ను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ చేసే వారు చాలా మంది ఉంటారు. అయితే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ను ఆన్ చేయకపోతే ఆ డేటా అదనపు భద్రత లేకుండానే క్లౌడ్‌లో నిల్వ ఉంటుంది. ఒకవేళ మీ క్లౌడ్ అకౌంట్ హ్యాక్ అయితే.. సంవత్సరాలుగా సేవ్ చేసిన చాట్స్, ఫోటోలు, వీడియోలు, ఫైళ్లు ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ అంటే?
ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే మీ బ్యాకప్ డేటా డివైస్ నుంచి బయటకు వెళ్లే ముందే ఎన్‌క్రిప్ట్ అవుతుంది. మీరు సెట్ చేసిన పాస్‌వర్డ్ లేదా ప్రత్యేక ఎన్‌క్రిప్షన్ కీ ద్వారా మాత్రమే దానిని యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్‌కే కూడా ఆ బ్యాకప్ లోని సమాచారం చూడడం సాధ్యం కాదు. దీంతో మీ వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉంటుంది.
ఈ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయాలి?
వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం. ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Chats’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ‘Chat Backup’ పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ‘End-to-End Encrypted Backup’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసి స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించాలి. చివరగా ఒక మంచి పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి లేదా ఎన్‌క్రిప్షన్ ‘కీ’ని సురక్షితంగా భద్రపరచుకోవాలి.
ఎందుకు ఈ ఫీచర్ వాడాలి?
సైబర్ మోసాలు, హ్యాకింగ్ ప్రయత్నాలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో కేవలం చాట్స్‌ను మాత్రమే కాదు.. వాటి బ్యాకప్ లను కూడా రక్షించుకోవడం చాలా అవసరం. ఫోన్ మారినప్పుడు లేదా డేటాను రీస్టోర్ చేసేటప్పుడు కూడా ఈ భద్రతా వ్యవస్థ మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. వాట్సాప్ అందిస్తున్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ ఫీచర్ శక్తివంతమైన భద్రతా సాధనం. అయినప్పటికీ చాలా మంది దీనిని ఉపయోగించడం మర్చిపోతున్నారు. ఈ ఫీచర్ ను ఇంకా ఆన్ చేయని వారు వెంటనే యాక్టివేట్ చేసుకోవడం మంచిది. కేవలం కొన్ని నిమిషాలు వెచ్చించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఉన్న మీ విలువైన చాట్స్, ఫోటోలు, ఫైళ్లకు అదనపు రక్షణ కల్పించవచ్చు.
