NTV Telugu Site icon

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఎందుకు కొనాలి..? ఏమిటా కథ..

Akshaya Tritiya

Akshaya Tritiya

Akshaya Tritiya: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు.. బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.. అక్షయ తృతీయ ఏ రోజు ఉందో తెలుసుకుని.. ఆరోజు బంగారం కొనుగోలు చేసేలా ప్లాన్‌ చేసుకుంటారు.. ఇక, ఆ రోజు పసిడికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా.. బంగారం వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు.. మొత్తంగా అక్షయ తృతీయ రోజు బులియన్ మార్కెట్లు కళకళ్లాడుతుంటాయి. ఓవైపు డిస్కౌంట్ ఆఫర్లు, గిఫ్ట్ వోచర్లతో వ్యాపారులు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ రోజు తులమో, మాసమో.. లేదా ఒక్క గ్రాము బంగారమైనా కొనుగోలు చేద్దాం అని ప్రయత్నాలు సాగించేవారు లేకపోలేదు.. అసలు అక్షయ తృతీయ ఏంటి? దాంతో గోల్డ్‌కు ఏమిటి సంబంధం?. ఆ రోజున పిసిడి కొనుగోలు చేసేందుకు ఎందుకు ప్రయత్నాలు జోరుగా చేస్తారు? అనే విషయాలను తెలుసుకుందాం..

ప్రజల నమ్మకం ఎలా ఉన్నా..? బంగారం వ్యాపారులు క్రమంగా అక్షయ తృతీయపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి.. హిందూ సంప్రదాయంలో విశిష్ఠ ప్రత్యేకత ఉన్న అక్షయ తృతీయను హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో మూడో రోజున జరుపుకుంటారు. అక్ష తీజ్ లేదా అక్తిగా పిలిచే ఈ రోజు ప్రతీ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. హిందువులు, జైనులు అక్షయ తృతీయను జరుపుకుంటారు. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ అక్షయ తృతీయను నిర్వహిస్తారు.. ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏంటి? అంటే.. అక్షయ తృతీయ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే రోజుగా నమ్ముతారు.. ఈ రోజున తాము పొందే డబ్బు కానీ, బంగారం కానీ, శాశ్వతంగా ఉంటుందనే భావన ఉంది.. ఇక, ఈ రోజు చేసే కొత్త ప్రయత్నాలు విజయం సాధిస్తాయని.. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించి పెడతాయనే నమ్మకం కూడా ఉంది.. అదృష్టానికి ప్రతీకగా నమ్మే అక్షయ తృతీయను శుభప్రదమైన రోజు.. అందేకే బంగారం లేదా ఏవైనా విలువైన వస్తువుల కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా వస్తుంది.

అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 22న వచ్చింది.. అంటే ఈ రోజే.. ఇవాళ ఉదయం 7:49 గంటలకు ప్రారంభమైన అక్షయతృతీయ రేపు అనగా.. ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 07:47 వరకు కొనసాగనుంది.. ఈ రోజు బంగారం కొనలేనివాళ్ల పరిస్థితి ఏంటి? అసలే బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న తరుణంలో.. బంగారం కొనలేనివాళ్లు.. ఏం చేయాలి అనేదానిపై కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి.. అక్షయ తృతీయ నాడు ఇంట్లో ఏదైనా మట్టి కుండ లేదా మట్టి పాత్రను ఉంచినా మంచిదట.. ఈ రోజు పూజ గదిలో కొన్ని దూది బంతులను ఉంచితే అది బంగారాన్ని పెట్టడంతో సమానమనే నమ్మకం కూడా ఉంది. అంతేకాదు పిడికెడు పసుపు ఆవాలు పూజా గదిలో ఉంచినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉందట.. అక్షయ తృతీయ రోజున నదిలో పుణ్యస్నానం చేసి నీరు, ధాన్యాలు, చెరకు, పెరుగు, సత్తు, పండ్లు, బిందెలు, వస్త్రాలు మొదలైన వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు అనేది మరికొందరి నమ్మకం. ఇలా అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేనివాళ్లు చేయాల్సిన పనులపై రకరకాల నమ్మకాలు ఉన్నాయి.