Enemy Act: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఇటీవల ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదిలా ఉంటే, మరో వార్తలో ఆయన సంచలనంగా మారారు. సైఫ్ కుటుంబానికి చెందిన రూ. 15,000 కోట్ల ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ‘‘ఎనిమీ యాక్ట్’’ కింద ఈ ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో ఈ ఆస్తుల్ని ‘‘ఎనిమి ప్రాపర్టీ’’గా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిని ఛాలెంజ్ చేస్తూ సైఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని గతేడాది డిసెంబర్‌లో హైకోర్టు కొట్టేసింది. డిసెంబర్ 13, 2024న జరిగిన విచారణలో, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ అగర్వాల్ సింగిల్ బెంచ్ నటుడి పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ తీర్పుపై అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.ఈ మొత్తం కేసులో కేంద్రం, సైఫ్ అలీ ఖాన్, సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, అతని సోదరిమణులు సోహా అలీఖాన్, సబా అలీ ఖాన్, అతని తండ్రి సోదరి సబిహా సుల్తాన్‌లు పార్టీలుగా ఉన్నారు.
‘‘ఎనిమీ యాక్ట్’’ అంటే ఏమిటి..?
ఈ చట్టం ప్రకారం, శత్రువుల ఆస్తుల్ని కేంద్రం ప్రభుత్వం నియంత్రించవచ్చు. విభజన సమయంలో, ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లి, అక్కడే పౌరులుగా స్థిరపడిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల్ని ‘‘ఎనిమీ ప్రాపర్టీ’’గా పరిగణిస్తారు. ముఖ్యంగా 1965, 1971 పాకిస్తాన్‌తో యుద్ధాల తర్వాత, చాలా మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని పాకిస్తాన్ వెళ్లారు. ఇదే విధంగా 1962 ఇండో-చైనా యుద్ధం తర్వాత చైనాకు వెళ్లిన వ్యక్తుల ఆస్తుల్ని కూడా ‘‘శత్రువు ఆస్తులు’’గా పరిగణిస్తారు.
ఎనిమీ యాక్ట్ 1968లో అమలులోకి వచ్చింది. ఇది 1962 రక్షణ నియమాల ప్రకారం.. భారతదేశానికి శత్రు ఆస్తిగా పరిగణించిన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. 2017లో, పార్లమెంటు ది ఎనిమీ ప్రాపర్టీ (సవరణమరియు వాలిడేషన్) బిల్లు-2016ను ఆమోదించింది. ఇది 1968 ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, ది పబ్లిక్ ప్రెమిసిస్(అనధికార అక్రమదారుల తొలగింపు) యాక్ట్-1971లను సవరించింది.
సైఫ్ అలీ ఖాన్ ఆస్తి ఎందుకు కోల్పోవచ్చు..?
2014లో, భోపాల్‌లోని పటౌడీ కుటుంబ ఆస్తులను ‘‘ఎనిమి ప్రాపర్టీ’’గా ప్రకటిస్తూ ప్రభుత్వం కస్టోడియన్ నోటీస్ జారీ చేసింది. పటౌడీ కుటుంబ ఆస్తిపై వారి వారసులకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేస్తూ 2016లో భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది.
భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ కు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు అబిదా సుల్తాన్ 1950 లోనే పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ భారత్ లోనే ఉండిపోయారు. నవాబ్ ఇఫ్తికర్ అలీఖాన్ పటౌడిని ఆమె పెళ్లి చేసుకున్నారు. దాంతో పటౌడి ఆస్తులకు ఆమె చట్టపరమైన వారసురాలు అయ్యింది. ఇక సాజిదా సుల్తాన్ మనవడే సైఫ్ అలీఖాన్. దీంతో పటౌడి ప్రాపర్టీలలో కొంత షేర్ ఈయనకు వస్తుంది. అయితే, అబిదా సుల్తాన్ పాకిస్తాన్‌కి వలస వెళ్లడం వల్ల ఆ ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీగా భావిస్తూ ప్రభుత్వం జప్తు చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తి ఇప్పుడు ప్రభుత్వం ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం