Site icon NTV Telugu

Union Budget 2026: ఆర్థిక సర్వే అంటే ఏంటి? కేంద్ర బడ్జెట్‌కు ముందు తప్పక తెలుసుకోవాల్సి అంశాలు ఇవే..

Parliament Budget Sessions

Parliament Budget Sessions

What Is The Economic Survey: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డబ్బును ఎలా సమీకరించబోతోంది? ఆ డబ్బును ఏయే రంగాల్లో ఖర్చు చేయబోతోందన్న విషయం స్పష్టమవుతుంది. కానీ బడ్జెట్‌కు ముందు మరో ముఖ్యమైన పత్రం పార్లమెంట్ ముందుకు వస్తుంది. అదే ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే అనేది ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేసే ఒక నివేదిక. దీనిని ప్రధానంగా ఆర్థిక వ్యవహారాల విభాగం సిద్ధం చేస్తుంది. ఇందులో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, గత ఏడాది ఆర్థికంగా ఏమి జరిగింది అనే అంశాలను సవివరంగా పరిశీలిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, ఎగుమతులు, ఉద్యోగాలు వంటి ముఖ్యమైన రంగాలపై ఇందులో విశ్లేషణ ఉంటుంది. ఈ సర్వేను నిర్వహించడంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ముఖ్య పాత్ర పోషిస్తారు.

READ MORE: Free LPG Cylinder Scheme: హోలీకి ముందు పేదలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా LPG సిలిండర్‌

బడ్జెట్ అనేది భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పే ప్రణాళిక అయితే.. ఆర్థిక సర్వే మాత్రం ఇప్పటివరకు జరిగినదాన్ని అద్దం పడుతుంది. దేశ ఆర్థిక వృద్ధి ఎలా సాగుతోంది? ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఆదాయం–ఖర్చుల మధ్య సమతుల్యం ఎలా ఉంది? వంటి విషయాలను ఇందులో వివరంగా చెబుతారు. అలాగే రాబోయే ఏడాదిలో ఎదురయ్యే అవకాశాలు, సమస్యలపైన అంచనాలు ఇస్తారు. ఇవన్నీ బడ్జెట్ తయారీకి ఒక దిశానిర్దేశం లాంటివి. అందుకే సాధారణంగా బడ్జెట్‌కు ఒక రోజు ముందే ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. దీని వల్ల ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితిపై అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పుకొనే అవకాశం లభిస్తుంది. అలాగే ఏ రంగంపై ఎక్కువ శ్రద్ధ అవసరమో, ఎక్కడ మార్పులు చేయాలో ఈ నివేదిక సూచిస్తుంది. దీని ఆధారంగానే పన్నులు, ఖర్చులు, కొత్త పథకాలు వంటి నిర్ణయాలు బడ్జెట్‌లో కనిపిస్తాయి.

READ MORE: Shocking Love Story: స్నేహం కాస్త ప్రేమగా.. ఇంట్లో నుంచి పారిపోయిన నలుగురు విద్యార్థినులు.. లింగ మార్పిడి చేసుకొని..!

ఆర్థిక సర్వే మరో ముఖ్యమైన పని సైతం చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులపై పార్లమెంట్ సభ్యులు, నిపుణులు, ప్రజలు చర్చించేందుకు ఇది అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది? అనే విషయం ఈ నివేదిక చదివితే కొంత స్పష్టమవుతుంది. ఈ చర్చల ప్రభావం కొన్నిసార్లు బడ్జెట్ ప్రతిపాదనలపై కూడా పడుతుంది. ఈ సర్వేలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు వంటి కీలక సమాచారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాజిక అంశాలపై వివరాలు ఉంటాయి. క్లిష్టంగా అనిపించే ఆర్థిక విషయాలను సులభంగా అర్థమయ్యేలా గణాంకాలు, చార్ట్‌లు, సరళమైన వివరణలతో ఇందులో చూపిస్తారు. మొత్తానికి, ఆర్థిక సర్వే అనేది బడ్జెట్‌కు ముందుగా వచ్చే ఒక కీలక సూచిక. ఇది దేశ ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక మార్గదర్శకంలా పనిచేస్తుంది. ఈ నివేదిక గురించి దేశ ప్రజలు సైతం తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మన దేశం ఆర్థిక స్థితిపై ఓ అంచనా వస్తుంది.

Exit mobile version