Human Brain: మనం చనిపోయే ముందు, మన శరీరంలో, ముఖ్యంగా మన మెదడులో ఎలాంటి పనులు జరుగుతాయనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయమే. దీనిపై అనేక ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘ఎన్‌హ్యాన్స్ ఇంటర్‌ప్లే ఆఫ్ న్యూరోనల్ కోహరెన్స్ అండ్ కప్లింగ్ ఇన్ ది డైయింగ్ హ్యూమన్ బ్రెయిన్’’ అనే పేరుతో ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరో సైన్స్ జర్నల్‌లో మెదడు అధ్యయనానికి సంబంధించిన కీలక విషయాలను ప్రచురించారు.
మరణానికి ముందు, మరణించే సమయంలో మానవ మెదడులో జరిగే కార్యకలాపాలను శాస్త్రవేత్తలు సంగ్రహించారు. చనిపోతున్న సమయంలో, ఆ వ్యక్తి తన జీవిత కాలంలో ఎదుర్కొన్న ముఖ్యమైన సంఘటనలు ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడేలా మెదడు పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. “జ్ఞాపకశక్తిని తిరిగి పొందడంలో సహాయపడే మెదడు తరంగాలు జీవితంలోని ముఖ్యమైన అనుభవాలను ప్లే చేసి ఉండొచ్చు.” అని టుకీలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అజ్మల్ జెమ్మర్ చెప్పారు. ఇతను ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.
Read Also: Infosys Layoffs: “సాఫ్ట్‌వేర్” ఆశలు ఆవిరి.. కన్నీటితో ఇళ్లకు వెళ్లిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్..
మూర్ఛ వ్యాధికి చికిత్స పొందుతున్న 87 ఏళ్ల రోగి, గుండెపోటుకు గురైనప్పుడు మెదడు పనితీరును రికార్డ్ చేశారు. రోగి తలపై అమర్చిన పరికరం మరణ సమయంలో 900 సెకన్ల మెదడు కార్యకలాపాలను రికార్డ్ చేసింది. వైద్యులు అతడి గుండె కొట్టుకోవడం, ఆగిపోయే ముందు తర్వాత 30 సెకన్లలో ఏం జరిగిందో గమనించడానికి వీలు కలిగింది. మెదడలులో ‘‘గామా డోలనాలు’’గా పిలిచే నాడీ తరంగాల్లో మార్పుల్ని గమనించారు. వీటిని డెల్టా, టీటా, ఆల్ఫా, గామా, బీటాగా వర్గీకరిస్తారు.
మెదడు తరంగాలు సాధారణంగా జీవించి ఉన్న సమయంలో మెదడులో జరిగే విద్యుత్ ప్రేరణలు. గామా తరంగాలు మెమోరీ తిరిగి పొందడంలో అధిక పనితీరును సూచిస్తుంది. ఇది మెమోరీ ఫ్లాష్‌బ్యాక్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ పరిశోధన మానవ జీవితానికి మించి ఉన్న వాటిని అణ్వేషించేందుకు, లోతుగా అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలకు దారులను తెరిచింది.