NTR – Jayaprada : నాటి మేటి అందాలతార జయప్రదకు కె.బాలచందర్ ‘అంతులేని కథ’, కె.విశ్వనాథ్ ‘సిరిసిరిమువ్వ’ చిత్రాలతో నటిగా ఎంతో పేరు లభించింది. అయితే ఆమెకు స్టార్ డమ్ తీసుకు వచ్చింది మాత్రం కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘అడవిరాముడు’ అనే చెప్పాలి. నటరత్న యన్టీఆర్ తో జయప్రద నటించిన తొలి చిత్రం కూడా ‘అడవిరాముడు’ కావడం విశేషం! 1977లో బ్లాక్ బస్టర్ గా నిలచిన ఈ చిత్రం తరువాత అదే యేడాది యన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘చాణక్య-చంద్రగుప్త’తో పాటు ‘మా ఇద్దరి కథ’,’యమగోల’ చిత్రాలలోనూ ఆయన సరసన జయప్రద నాయికగా నటించి అలరించారు. దాంతో రామారావు హిట్ పెయిర్ గా పేరు సంపాదించారు. మరుసటి ఏడాది “మేలుకొలుపు, యుగపురుషుడు, రాజపుత్రరహస్యం” చిత్రాలలోనూ యన్టీఆర్ తో జోడీ కట్టి మురిపించారు జయప్రద. ఆపై యన్టీఆర్ డైరెక్షన్ లోనే ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’లో జయప్రద నటించారు. తరువాత “ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, సూపర్ మేన్” చిత్రాలలో రామారావుతో జోడీ కట్టి ఆకట్టుకున్నారు జయప్రద. యన్టీఆర్-జయప్రద జంటగా నటించిన చిత్రాలలో ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే మిగిలినవన్నీ జనాదరణ పొందినవే! అలాంటి యన్టీఆర్ తో జయప్రద మళ్ళీ నటించక పోవడానికి కారణమేంటి?
Read Also: Prabhu Deva : ప్రజ్ఞాశాలి… ప్రభుదేవ!
ఆ రోజుల్లో యన్టీఆర్ తరువాత మాస్ హీరోగా సాగుతున్న కృష్ణతో జయప్రద పలు చిత్రాల్లో నటిస్తూన్నారు. కృష్ణ సరసన విజయనిర్మల తరువాత ఎక్కువ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది జయప్రదనే! కృష్ణతో వరుసగా చిత్రాలు చేస్తోన్న జయప్రద, ఎక్కడో ‘పెద్దాయన’ను ఏమో అన్నదని వినిపించింది. అది నిజమో కాదో తెలియకుండానే, కొందరు దానిని చిలువలు పలువలుచేస్తూ యన్టీఆర్ చెంతకు తీసుకు వెళ్ళారు. దాంతో రామారావు సైతం ఆమెను దూరం పెట్టారు. ఇదేమీ తెలియని జయప్రద తనకు ఎందుకనో యన్టీఆర్ చిత్రాలు రావడం లేదనుకుంది. ఆ తరువాత యన్టీఆర్-శ్రీదేవి జోడీ జనాన్ని ఆకట్టుకోవడంతో అసలు యన్టీఆర్ సరసన జయప్రద ఊసు ఎవరూ ఎత్తలేదు. తరువాత విషయం తెలుసుకొనే లోపు, ఆయన రాజకీయ ప్రవేశం చేయడం, జయప్రద సైతం హిందీ చిత్రాలలో బిజీ కావడం జరిగాయి. ఏది ఏమైనా యన్టీఆర్ ను ‘పెద్దాయన’ అంటూ ఆమె ఎప్పుడూ గౌరవించేవారు.
Read Also: Rashmika: నేషనల్ క్రష్ కూడా లేడీ ఓరియెంటెడ్ చేసేస్తోంది…
సినిమాల్లోనే కాకుండా రాజకీయరంగంలోనూ జయప్రద రాణించారు. అందుకు కూడా యన్టీఆర్ కారణమని చెప్పక తప్పదు. 1994లో యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీలో చేరారు జయప్రద. ఆ తరువాత ఆ పార్టీ తరపున రాజ్యసభకూ వెళ్ళారు. ఆ పై ఉత్తరాదిన సైతం ఎమ్.పి.గా గెలిచారు. ఆ రోజుల్లో యన్టీఆర్, జయప్రద మధ్య గొడవయింది అని కొందరు చాటింపు వేశారు. పెద్దాయనతో గొడవపడే స్థాయి తనకుందా అంటూ జయప్రద ప్రశ్నించేవారు. ఏది ఏమైనా యన్టీఆర్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న జయప్రద, ఆయన పార్టీతోనే రాజకీయాల్లోనూ రాణించారన్నది నిజం!
