పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు.. మరి మెగాస్టార్ చిరంజీవి పరిస్థితేంటి? అనేదే ఇప్పుడు తేల్చుకోలేకపోతున్నారు మెగా అభిమానులు. కొన్నేళ్లుగా సెట్స్ పై ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఎట్టకేలకు మరోసారి వాయిదా వేశారు మేకర్స్. మే 9న వీరమల్లు రాబోతున్నాడని సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రిలీజ్ చేసి తీరేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరో వారం రోజులకు అటు ఇటుగా డేట్స్ ఇస్తే వీరమల్లు షూటింగ్ పూర్తి కానుంది.
అయితే హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ రాకతో.. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ పరిస్థితేంటి? అనే చర్చ మొదలైంది. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. విఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయిన రోజు.. అంటే మే 9న విశ్వంభరను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇదే డేట్‌కు వీరమల్లు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడనే క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
ప్రస్తుతానికి విశ్వంభర సినిమా ఫైనల్ షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ప్యాచ్ వర్క్‌లు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నారు. మరోవైపు వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన విజువల్ ఎఫెక్ట్స్ అవుట్ పుట్ పట్ల చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉన్నట్టుగా చెబుతున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఆగష్టులో విశ్వంభర రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.