T20-world-cup: టీ20 ప్రపంచకప్ 2022లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ జట్టు సూపర్ 12కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఈరోజు గ్రూప్ బి మ్యాచ్‌లో భాగంగా హోబర్ట్‌లో వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. సూపర్ 12కు చేరాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్ లో నికోలస్ పూరన్ నాయకత్వంలోని విండీస్ జట్టు చేతులెత్తేసింది.
Read Also: ‘ఉర్వి’ దుస్తుల కంటే ఉల్లిపొరలే నయం
ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. 147 పరుగులతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి 150 పరుగులు చేసి నెగ్గింది. లోర్కాన్ టక్కర్ (35 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రీ బల్ బిర్నీ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ వంతు పాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్ లో సూపర్ 12కు చేరుకోవడం ఐర్లాండ్ కు ఇదే తొలిసారి.
Read Also: Ginna Movie Review: జిన్నా రివ్యూ
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో గ్యారెత్ గెలానీ 3 వికెట్లతో సత్తా చాటాడు. బ్యారీ మెక్ కార్తి, సిమి సింగ్ చెరో వికెట్ సాధించారు. బ్రాండన్ కింగ్ (48 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. చివర్లో ఒడెన్ స్మిత్ (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.