Weight Loss Injection: ‘ఫ్యాట్ టూ ఫిట్’ పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..!

Weight Loss

Weight Loss

Weight Loss Injection: ప్రస్తుతకాలంలో ఊబకాయం (ఒబేసిటీ) ఒక పెద్ద సమస్యగా మారింది. సన్నగా, స్లిమ్‌గా మారి ఆనందంగా గడపాలని ఎందరో కలలు కంటుంటారు. ప్రజల ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు, త్వరగా బరువు తగ్గిస్తామంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో “జస్ట్ ఒకే ఒక్క ఇంజెక్షన్ వేసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది” అంటూ ఊబకాయుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ ప్రమాదకరమైన ముఠా భరతం పట్టారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.

‘ఫ్యాట్ నుంచి ఫిట్‌’గా మారాలంటూ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా ముఠా ప్రచారం చేస్తోంది. అమెరికాలో ఇంకా ప్రయోగాత్మక పరీక్షల (క్లినికల్ ట్రయల్స్) దశలోనే ఉన్న వెయిట్ లాస్ ఇంజెక్షన్లను వీరు ఆన్‌లైన్ వేదికగా అక్రమంగా విక్రయిస్తున్నారు. ఆ ఇంజెక్షన్ సీసాలపై ‘కేవలం పరిశోధనల కోసం మాత్రమే వినియోగించాలి’ అని స్పష్టంగా రాసి ఉన్నప్పటికీ.. ‘రీసెర్చ్ పెప్టైడ్’ పేరుతో వాటిని సామాన్య ప్రజలకు నేరుగా అంటగడుతున్నారు. టార్గెట్ చేసిన కస్టమర్లకు ఒక్కో ఇంజెక్షన్‌ను రూ. 5,000 వరకు విక్రయిస్తూ, వారిలో నమ్మకం కలిగించేందుకు ఇంజెక్షన్‌తో పాటు 12 పేజీల సమాచార పత్రాలను కూడా పంపిస్తున్నారు.

ఈ దందాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. కాన్పూర్‌లోని మురళీ ధామ్ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు కొరియర్ ద్వారా ఈ ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నట్లు తేలింది. ఇప్పటికే సంతోష్ రెడ్డి అనే వ్యక్తికి రూ. 6,000 విలువైన ఇంజెక్షన్లు, మరో వ్యక్తికి రూ. 23,000 విలువైన సరుకును కొరియర్ ద్వారా పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ అక్రమ పంపిణీదారులతో పాటు, చట్టవిరుద్ధంగా వీటిని కొనుగోలు చేసిన వారిపైనా అధికారులు నిఘా పెట్టారు.

క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాని, భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి లేని ఇలాంటి ఇంజెక్షన్లను వాడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వినియోగం వల్ల జీర్ణకోశ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటమే కాకుండా గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి బరువు తగ్గేందుకు ఇలాంటి ఆన్‌లైన్ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, కేవలం అర్హులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్స తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.