NTV Telugu Site icon

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ప్రజలకు హెచ్చరిక ఇదే!

Aeie

Aeie

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీంతో పాటు వానల సమయాల్లో ప్రయాణాలు చేసే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇంకోవైపు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show comments