NTV Telugu Site icon

Zakir Hussain Death: మనమే బెస్ట్‌ అని అనుకోకూడదు.. ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి!

Zakir Hussain Death

Zakir Hussain Death

ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్‌ గ్రహీత జాకీర్‌ హుస్సేన్‌ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్‌ హుస్సేన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.

జాకీర్‌ హుస్సేన్‌ అసలు పేరు జాకీర్‌ హుస్సేన్‌ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడు. జాకీర్‌ హుస్సేన్‌ గతంలో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి విద్యార్థిగా ఉన్నపుడే విజయం సాధిస్తారన్నారు. ‘ఎన్ని అవార్డులు, పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడూ నేర్చుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్‌ అని ఎప్పుడూ అనుకోకూడదని నాన్న చెప్పేవారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మంచి మంచి విద్యార్థిగా ఉండాలి, అప్పుడే విజయం వరిస్తుంది. నేను గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు.. వారు ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉండాలన్నారు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి’ అని జాకీర్‌ హుస్సేన్‌ అన్నారు.

‘నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నా. అయినా ఎప్పుడూ దీని గురించి నేను ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే.. 15 మంది పేర్లు చెబుతాను. నేనే బెస్ట్‌ అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే విజయాలు దొరమవుతాయి’ అని జాకీర్‌ హుస్సేన్‌ చెప్పిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. జాకీర్‌ హుస్సేన్‌ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచి.. ఏడేళ్లకే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ అవార్డులు దక్కాయి. జాకీర్‌ హుస్సేన్‌ 10 ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.

Show comments