WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!

  • వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్..
  • పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ జారీ చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం
  • గత ఏడాది WCLలో పాకిస్థాన్ ఛాంపియన్స్ రన్నరప్‌గా..
Wcl 2026

Wcl 2026

WCL 2026: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ వైదొలిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎన్‌ఓసీ (NOC) జారీ చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఛాంపియన్స్ ప్రకటించింది. గత ఏడాది టోర్నీలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి పాకిస్థాన్ జట్టు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

WCL విషయంలో పీసీబీ గతంలోనే కఠిన వైఖరి ప్రకటించింది. ఈ టోర్నీ నిర్వహణలో “వివక్ష, ద్వంద్వ వైఖరి” ఉన్నాయని ఆరోపించిన పీసీబీ.. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడాన్ని తాము ఇకపై సహించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో WCLలో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనకుండా “బ్లాంకెట్ బ్యాన్” విధిస్తున్నట్లు గత ఏడాదే ప్రకటించింది.

అయితే ఈ ఏడాది పాకిస్థాన్ ఛాంపియన్స్‌ను టోర్నీలో పాల్గొనేలా చేసేందుకు WCL నిర్వాహకులు పీసీబీతో చర్చలు జరిపారు. ఎన్‌ఓసీల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ పీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో చివరకు పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పీసీబీ అవసరమైన ఎన్‌ఓసీ జారీ చేయడానికి నిరాకరించిన నిర్ణయాన్ని కొనసాగించడంతో.. జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాల్గొనలేకపోతున్నామని చింతతో తెలియజేస్తున్నాం అని పాకిస్థాన్ ఛాంపియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

జట్టు యజమాని కమీల్ ఖాన్ పీసీబీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆటగాళ్లకు ఈ అంతర్జాతీయ టోర్నీలో పాకిస్థాన్ ఛాంపియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కకపోవడం తమకు నిరాశ కలిగించిందని జట్టు పేర్కొంది. ఆటగాళ్లు, అభిమానులు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపింది.

ఈ ఏడాది WCL అక్టోబర్ 3న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ప్రారంభమైంది. పాకిస్థాన్ ఛాంపియన్స్ బంగ్లాదేశ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు. పీసీబీతో ఎన్‌ఓసీపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మ్యాచ్‌లను తిరిగి షెడ్యూల్ చేసేందుకు కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే సోమవారం ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉండటంతో సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదని స్పష్టమైంది. దీంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలగాల్సి వచ్చింది.

పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది నాయకత్వం వహించాల్సి ఉంది. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, వహాబ్ రియాజ్ వంటి మాజీ స్టార్ క్రికెటర్లు కూడా జట్టులో ఉన్నారు. గత ఏడాది భారత్ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో తలపడకుండా వైదొలగడంతో పీసీబీ, WCL మధ్య వివాదం మొదలైంది. ఇందులో ఒకటి సెమీఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు వాక్‌ఓవర్ లభించింది. అయితే గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్‌తో ఆడకుండా తప్పుకోవడంతో భారత్‌కు ఒక పాయింట్ ఇవ్వడంపై పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ క్రీడా సమాజానికి “ఆమోదయోగ్యం కాని సందేశం” అని అప్పట్లో పీసీబీ విమర్శించింది.