NTV Telugu Site icon

Viral Video: ఒక్కసారిగా జలపాతంలో పెరిగిన వరద.. యువకుడు గల్లంతు

Water Falls

Water Falls

Courtallam Waterfalls in Tenkasi:  ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. వేసవి కావడంతో పర్యాటకులు జలపాతాల వద్దకు పరుగులు తీస్తుంటారు. కానీ ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొన్ని జలపాతాల్లో ప్రవాహం డేంజర్‌ లెవెల్‌కు చేరింది. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలో గల ‘కుర్తాళం’ జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు. కాగా, తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన బాలుడి కోసం అగ్నిమాపక శాఖ, పోలీసులు గాలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవాహం పెరిగినట్లు తెలుస్తోంది.