NTV Telugu Site icon

ముదురుతున్న జలవివాదం.. పోటా పోటీ లేఖలు.. !

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతుండడంతో ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. మరోవైపు ఇటీవల సమావేశాలకు హాజరుకాని తెలంగాణ… సెప్టెంబర్‌ 1న జరిగే KRMB మీటింగ్‌కు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ సమావేశానికి వెళ్లనున్నారు. న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల్లో ఒక్క బొట్టుకూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఇరిగేషన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం కెఆర్ఎంబీ, ట్రైబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని చెప్పుకొచ్చారు. సరైన పూర్తి సమాచారంతో కెఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా మాట్లాడాలని అధికారులకు సూచించారు కేసీఆర్‌.

ఇటు కృష్ణా జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోకూడదని ఏపీ ప్రభుత్వం డిసైడ్‌ అయింది. ఇందులో భాగంగా కేఆర్‌ఎంబీకి వరుస లేఖలు రాస్తోంది. వచ్చేనెల 1న జరిగే భేటీలో గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. విభజన జరిగిన తర్వాత ఏడేళ్ల వరకు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన గెజిట్ విడుదల చేయలేదు. గతంలో గెజిట్ విడుదల చేయాలని కోరినా.. అప్పట్లో పట్టించుకోలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక…. ప్రధానంగా నీటి వివాదాల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఇటు నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. భవిష్యత్తులో కృష్ణా నీటి పంపకాల విషయంలో ఎలాంటి మొహమాటలకు పోకూడదని భావిస్తోంది. ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచాలన్న తెలంగాణ డిమాండ్‌పై సీరియస్‌గానే స్పందిస్తోంది జగన్‌ సర్కార్‌. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 సంవత్సరానికి 70-30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఇరిగేషన్‌ ఈఎన్సీ. ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ తెలంగాణ డిమాండ్‌పై అభిప్రాయం అడగ్గా వెంటనే KRMBకి లేఖ రాసింది సర్కార్‌. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది.