Site icon NTV Telugu

West Bengal: బెంగాల్ అసెంబ్లీలో రగడ.. సభలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం నాడు సభలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా బీర్బూమ్ ఘటనపై సీఎం మమత మాట్లాడాలని బీజేపీ నేతలు పట్టుబట్టడం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది.

ఇటీవల బీర్బూమ్‌లో టీఎంసీ నేత హత్యతో అల్లర్లు చేలరేగి హింసకు దారి తీసింది. దీంతో అధికార పార్టీ నేతలు ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పంటించడంతో ఈ ఘటనలో 8 మంది సజీవదహనం అయ్యారు. ఈ వివాదంపై చర్చించాలని సోమవారం నాడు సభలో బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. సభ్యులను అదుపుచేయడానికి మార్షల్స్ రంగప్రవేశం చేసి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆగ్రహించిన స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

కాగా అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ నేతలు ట్విట్టర్‌లో షేర్ చేశారు. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Exit mobile version