Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే స్వామివారి వక్షస్థలంపై కొలువై ఉన్న వ్యూహ లక్ష్మి అచ్చు గురించి చాలా మందికి తెలియదు. ఇది తిరుమలలోని అత్యంత పవిత్రమైన, అరుదుగా దర్శనమిచ్చే దైవిక విశేషాల్లో ఒకటిగా భావిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భక్తులకు ఈ దివ్య రూపాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది.
“అచ్చు” అనే పదానికి ముద్ర లేదా ప్రతిరూపం అనే అర్థం ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కుడి వక్షస్థలంపై పద్మాసనంలో ఆసీనురాలై ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి రూపమే ‘వ్యూహ లక్ష్మి అచ్చు’. రెండు చేతులతో కమలాసనంపై కూర్చొని భక్తులకు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదించే రూపంగా ఆమెను వర్ణిస్తారు. తిరుమల ఆలయ ఆరాధన విధానాలకు మూలమైన ఆగమ శాస్త్రాల్లో కూడా వ్యూహ లక్ష్మి ప్రస్తావన కనిపిస్తుంది.
సాధారణంగా స్వామివారి వక్షస్థలం బంగారు ఆభరణాలు, అలంకారాలతో కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా “బంగారు లక్ష్మి” అనే ఆభరణం వ్యూహ లక్ష్మి అచ్చు మీదే అలంకరించబడుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఈ దివ్య రూపాన్ని చూడటం సాధ్యం కాదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. ప్రతి గురువారం స్వామివారి అలంకరణను సరళీకరించి, ఎక్కువ ఆభరణాలను తొలగిస్తారు. ఈ సమయంలో వ్యూహ లక్ష్మి అచ్చు స్వల్పంగా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రవారం జరిగే అభిషేక సమయంలో బంగారు లక్ష్మి ఆభరణాన్ని తొలగించి, వ్యూహ లక్ష్మికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆమె రూపాన్ని మరింత స్పష్టంగా దర్శించే అవకాశం లభిస్తుంది.
శుక్రవారాల్లో జరిగే నిజపాద దర్శనం సేవలో కూడా స్వామివారి ఆభరణాలు తొలగించబడటంతో భక్తులు వ్యూహ లక్ష్మి అచ్చును దర్శించగలుగుతారు. కొన్ని ప్రత్యేక ఉత్సవాలు, అర్చనలు, ఆలయ మరమ్మత్తుల సమయంలో కూడా ఈ దివ్య రూపం కనిపించే అవకాశాలు ఉంటాయి. వ్యూహ లక్ష్మి అచ్చుకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణు సహస్రనామ అర్చన అనంతరం అర్చకులు లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారి చిహ్నాలను పూజిస్తారు. షోడశ నామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ తులసీదళాలు సమర్పిస్తారు. శుక్రవారం ప్రత్యేక పూజల్లో శ్రీ సూక్తం పారాయణం చేసి పసుపు, గంధం, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు.
భక్తుల నమ్మకం ప్రకారం వ్యూహ లక్ష్మి అచ్చు లేదా దాని పవిత్ర ప్రతిరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆర్థిక స్థిరత్వం, సానుకూల శక్తి లభిస్తాయని చెబుతారు. అయితే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ వ్యూహ లక్ష్మి అచ్చును ఎక్కడా విక్రయించడం లేదని.. మార్కెట్లో లభించే అనేక ప్రతిరూపాలు నకిలీవని.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వేంకటేశ్వరస్వామి విడదీయరాని దైవ స్వరూపాలుగా భావిస్తారు. అందువల్ల వ్యూహ లక్ష్మి దర్శనం భక్తులకు సంపద, రక్షణ, ఆధ్యాత్మిక పరిపూర్ణతను ప్రసాదిస్తుందని విశ్వాసం. తిరుమలకు వెళ్లే భక్తులు గురువారం లేదా శుక్రవారం దర్శనం ప్రణాళిక చేసుకుంటే ఈ అరుదైన దివ్య దర్శన భాగ్యం పొందే అవకాశం ఉంటుంది.

