NTV Telugu Site icon

Vontimitta Kodanda Rama Kalyanam: నేడు పున్నమి వెలుగుల్లో కోదండరాముడి కళ్యాణం.. సిద్ధమైన ఒంటిమిట్ట

Vontimitta

Vontimitta

Vontimitta Kodanda Rama Kalyanam: పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి సర్వం సిద్ధం అవుతోంది.. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది.. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా.. అందులో భాగంగా ఛైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం జరిపించడం ఒంటిమిట్ట ఆనవాయితీగా వస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కళ్యాణం కోసం ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక, ఒంటిమిట్ట ఆలయం కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే రహదారికి పక్కనే ఉండడంతో.. కల్యాణోత్సవం దృష్ట్యా.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ దారిమల్లించారు..

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం సందర్భంగా కడప – తిరుపతి మధ్య భారీ వాహనాలు దారి మళ్లించారు.. నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని.. ఉదయం 6:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఈ వాహనాల దారి మళ్లింపు ఉంటుందని తెలిపారు కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లించాం అన్నారు.. ఇక, కల్యాణ వేదిక సమీపం నుండి కడప మార్గంలో 10 చోట్ల, సాలాబాద్ వద్ద 5 ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.

కాగా, ఒంటిమిట్టలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. ఈ నెల 25 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వాహన సేవలు జరుగుతున్నాయి. ఈరోజు కళ్యాణోత్సవం, రేపు రథోత్సవం, 25వ తేదీన చక్రస్నానం, 26న పుష్పయాగం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు.. మరోవైపు నేడు సీతారాముల కళ్యానోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మంచినీటి సౌకర్యంతో పాటు.. తీర్థప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.