విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. జగన్ పర్యటన రోజే విశాఖలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్ అవుతుందని, రోడ్ బ్లాక్ అయితే తమిళనాడులో దళపతి విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేం అని సీపీ తేల్చి చెప్పారు.
‘అక్టోబర్ 9న ఉమ్మడి విశాఖలో వై ఎస్ జగన్ పర్యటన ఉన్నట్లు మాకు సమాచారం ఇచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి 11 గంటలకు చేరుకుంటారు. రోడ్ మార్గంలో మాకవరపాలెం వరకు వెళ్ళే యోచన ఉన్నట్టు చెప్పారు. అదే రోజు మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ ఉంది. ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు మ్యాచ్‌కు వస్తున్నారు. పోలీస్ మొత్తం ఆ బందోబస్తు సేవలు అందిస్తారు. ఆ రోజు చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎయిర్‌పోర్ట్ కూడలి నుంచి 11 కిలోమీటర్లు మర్రిపాలెం కూడలి వరకు వైఎస్ జగన్ పర్యటన మార్గం ఉంది. ర్యాలీగా వేల వేల మంది వస్తారు అని సమాచారం ఉంది. జాతీయ రహదారి బ్లాక్ అవుతుంది. తమిళ నాడులో సినీ నటుడు విజయ్ రోడ్ షోకి ఏ విధమైన ఇబ్బంది వచ్చింది అదే పరిస్థితి వస్తుంది. ఈ కారణాలతో జగన్ పర్యటనకు పోలీస్ అనుమతి లేదు. ఈ విషయాన్ని నేరుగా వారికి లేఖలో తెలియజేస్తున్నాం’ అని సీపీ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.
Also Read: Uppada Fishermen: పవన్ కల్యాణ్ చొరవ.. ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ!
‘ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటన ఆగదు. పోలీసులను మేం పర్మిషన్ అడగలేదు.. భద్రత కల్పించమని మాత్రమే అడిగాం. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత. ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్‌కు జగన్ రెడ్డి పర్యటనకు సంబంధం ఏంటో సీపీ చెప్పాలి. కశ్మీర్‌లో కార్యక్రమం జరిగితే కన్యాకుమారిలో అనుమతులు రద్దు చేస్తారా?. 65 వేల మంది ప్రజలు జగన్ టూర్‌కు వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అది ప్రజల్లో ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనం. జగన్ హెలికాఫ్టర్‌లో వెళితే అనుమతులు ఇస్తాం అనడంపై నాకు అనుమానం ఉంది. కుట్ర ఉందేమో అనే అభిప్రాయం నాది. మహా నేతను ఇప్పటికే కోల్పోయాం. ఇప్పుడు ప్రజానేత పర్యటన మీద ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు తట్టుకో లేకే ఎస్పీ, సీపీ అనుమతులు ఇవ్వడం లేదు’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు.
