Site icon NTV Telugu

Suicide Case: ఐఫోన్ కొనివ్వలేదని.. అత్మహత్య చేసుకున్న యువకుడు!

Visakhapatnam Iphone Suicide

Visakhapatnam Iphone Suicide

సాధారణంగా పరీక్షలో ఫెయిల్ అయ్యాను అన్న భయంతోనో, జాబ్ రాలేదు అన్న దిగులుతోనో, లేదంటే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఉచ్చులో పడి యువత ఆత్మహత్యలు చేసుకోడం చూస్తుంటాం. కానీ ఈ ఘటన మాత్రం బాధ పడాలో, ఓదార్చాలో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు ఖరీదైన ఐ ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై జీవితాన్నే ఫణంగా పెట్టాడు. మూర్ఖంగా ప్రవర్తించి అత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. కేవలం ఓ ఐ ఫోన్ కోసం పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. చేతికంది వచ్చిన కొడుకు సూసైడ్ చేసుకోవడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

తల్లిదండ్రులు ఐ ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు సూసైడ్‌కు పాల్పడిన ఘటన విశాఖలోని పెందుర్తిలో జరిగింది. సుజాతనగర్ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ స్టాక్ మార్కెటింగ్ విధులు నిర్వర్తిస్తుంటారు. ఈయనకు సాయి మారుతి కెవిన్ అనే పాతికేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి కొన్నాళ్ల పాటు సినీరంగంలో ఫొటోగ్రఫీ విభాగంలో పని చేశాడు. ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్‌తో కొన్నాళ్ళు ఆడుతూ పాడుతూ ఇష్టమైన ప్రొఫెషన్‌లో కొనసాగాడు. అయితే మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు జిరిగాయో.. ప్రస్తుతం ఇంటికి తిరిగి వచ్చి ఖాళీగా ఉంటున్నాడు.

ఈ మధ్య ఐఫోన్‌లో వచ్చిన కొత్త సీరీస్‌పై మోజు పెంచుకున్నాడు. కొన్ని రోజులుగా ఐఫోన్ కొనాలని తండ్రిని అడుగుతున్నాడు. ఖర్చుతో కూడుకున్న మొబైల్ కావడంతో తండ్రి నిరాకరించినట్లు సమాచారం. తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు సాయి మారుతి కెవిన్. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రం 5 గంటలైనా బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో గడియ విరగ్గొట్టి చూడగా సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. కిందకు దించి చూసేసరికి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు. కేవలం ఐ ఫోన్ కోసం సాయి మారుతి కెవిన్ సూసైడ్ చేసుకోవడం.. స్థానికంగా అందరినీ కలవరపెడుతోంది.

Exit mobile version