Site icon NTV Telugu

Virender Sehwag: ధోనీ నన్ను జట్టు నుంచి తొలగించాడు.. నేరుగా సచిన్ దగ్గరికి వెళ్లా..!

Virender Sehwag Ms Dhoni

Virender Sehwag Ms Dhoni

Virender Sehwag says MS Dhoni Dropped Me in 2008: భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఓపెనర్‌లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. అప్పటి టాప్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బ్రెట్ లీ లాంటి గ్రేట్ పేసర్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్స్ కొట్టిన ఘటన వీరూది. బౌలర్ ఎవరైనా, ఎంతమంది ఫీల్డర్లు ఉన్నా.. బంతి ఆఫ్ సైడ్ నుంచి బౌండరీకి దూసుకెళ్లేది. సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే.. అప్పటి టాప్ బౌలర్లు కూడా భయపడేవారు. 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంతో వీరేంద్రుడు కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని భావించాడట. అందుకు కారణం అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ అని తాజాగా సెహ్వాగ్ తెలిపాడు.

2003 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో వీరేంద్ర సెహ్వాగ్ (82) టాప్ స్కోరర్ అన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ అనంతరం వీరూ మంచి ప్రదర్శనే చేశాడు. 2008 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో విఫలమయ్యాడు. మొదటి ఐదు మ్యాచ్‌లలో 16.20 సగటుతో 81 పరుగులు మాత్రమే చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 33. దాంతో కెప్టెన్ ఎంఎస్ ధోనీ మిగతా మూడు మ్యాచ్‌లకు పక్కనపెట్టాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ఫైనల్స్ మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. ఆరు నెలల తర్వాత కిట్‌ప్లై కప్‌లో సెహ్వాగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల్లో 150 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆపై స్థిరమైన ఫామ్‌ను కొనసాగిస్తూ 2011 వన్డే ప్రపంచకప్ ఆడాడు. ధోనీ తనను తుది జట్టు నుంచి తొలగించడంతో సెహ్వాగ్ రిటైర్ అవ్వాలని భావించాడట. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహాతో వెనక్కి తగ్గాడట.

Also Read: Pilot Rohith Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. త్వరలోనే తాండూరుకు వస్తా!

‘2008లో శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లు నేను ఆడాను. ఆపై ఎంఎస్ ధోనీ నన్ను జట్టు నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొంతకాలం నన్ను ఎంపిక చేయలేదు. ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేకపోతే.. వన్డే క్రికెట్ ఆడటంలో అర్థం లేదని నాకు అనిపించింది. సచిన్ దగ్గరికి వెళ్లి నేను వన్డేల నుంచి రిటైర్ కావాలనుకుంటున్నా అని చెప్పా. ‘నేను 1999-2000లో ఇలాంటి సంధి దశను ఎదుర్కొన్నాను. ఆ దశ వచ్చి పోయింది. ఇప్పుడు నువ్ అలాంటి దశనే ఎదుర్కొంటున్నావు. భావోద్వేగానికి గురైనప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. కొంత సమయం ఆగు. 1-2 సిరీస్‌లు ఆడాక నిర్ణయం తీసుకో’ అని చెప్పాడు. 6 నెలల తర్వాత జట్టులోకి వచ్చి పరుగులు చేశాను. 2011 ప్రపంచకప్ కూడా ఆడాను. మేము ప్రపంచకప్‌ను కూడా గెలిచాం’ అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. సెహ్వాగ్ 251 వన్డే మ్యాచ్‌ల్లో 8273 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు.

Exit mobile version