NTV Telugu Site icon

Virat Kohli Retirement: రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Retirement

Virat Kohli Retirement

టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కింగ్ టెస్ట్, వన్డేలు ఆడుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వ‌న్డేల‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడ‌ని సోషల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే విరాట్ మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అప్పటినుంచి అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటికీ విరాట్ తాజాగా చెక్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్‌ 2027 వరకూ తాను ఆడతానని సంకేతాలు ఇచ్చాడు.

ఐపీఎల్ 2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ.. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గోన్నాడు. ఈ సంద‌ర్భంగా హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా విరాట్ సమాధానం ఇచ్చాడు. మీ నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటి? అని హోస్ట్ అడగ్గా.. ‘నా నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటో తెలియదు కానీ.. వన్డే ప్రపంచకప్‌ 2027 గెలవడానికి ప్రయత్నిస్తా’ అని విరాట్ బదులిచ్చాడు. తన తదుపరి లక్ష్యం వన్డే ప్రపంచకప్‌ 2027 అని కోహ్లీ చెప్పాడు. అంటే 2027 వరకు ఆటలో విరాట్ కొనసాగాలనుకుంటున్నాడు. విషయం తెల్సిన విరాట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం తేలిపోయింది. మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ 765 పరుగులతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా నిలిచాడు. అయితే భారత్ ఓడిపోవడంతో కోహ్లీకి నిరాశ తప్పలేదు. వన్డే ప్రపంచకప్‌ 2027 దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. ఈ టోర్నీ గెలిచి తన లక్ష్యంను నెరవేర్చుకోవాలని కింగ్ చూస్తున్నాడు.