Site icon NTV Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఒకే ఒక్క సెంచరీ! ఇదే చివరి అవకాశం

Virat Kohli Test

Virat Kohli Test

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 భాగంగా డిసెంబరు 14 నుంచి గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. పెర్త్ టెస్టులో భారత్‌ 295 పరుగుల తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి.

మూడో టెస్ట్ జరగనున్న గబ్బాలో స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ సెంచరీ బాదితే.. ఓ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంటాడు. ఆస్ట్రేలియాలోని ఐదు ప్రధాన స్టేడియాల్లో సెంచరీలు చేసిన మూడో విదేశీ ఆటగాడిగా విరాట్ నిలుస్తాడు. ఇప్పటివరకు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 1977లో బ్రిస్బేన్, పెర్త్, మెల్‌బోర్న్‌.. 1985లో అడిలైడ్, సిడ్నీలో సన్నీ సెంచరీలు చేశాడు. 2006లో పెర్త్‌.. 2010-11లో బ్రిస్బేన్‌, అడిలైడ్, సిడ్నీ.. 2017లో మెల్‌బోర్న్‌లో కుక్ శతకాలు బాదాడు.

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు టెస్టుల్లో ఏడు సెంచరీలు బాదాడు. అడిలైడ్‌లో మూడు సెంచరీలు ( 2012లో ఒకటి, 2014లో రెండు), పెర్త్‌లో రెండు సెంచరీలు (2018, 2024), మెల్‌బోర్న్‌లో (2014), సిడ్నీలో (2015)లో ఒక్కో సెంచరీ చేశాడు. మూడో టెస్ట్ జరగనున్న గబ్బాలో విరాట్ ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. 36 ఏళ్ల కోహ్లీకి ఇదే చివరి ఆసీస్ పర్యటన అయ్యే అవకాశం ఉంది. అందుకే గబ్బాలో సెంచరీ చేస్తే సన్నీ సరసన విరాట్ నిలవనున్నాడు.

Exit mobile version