NTV Telugu Site icon

కొత్తిమీర తినేవాళ్లు ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఆకుకూరలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని అందరూ భావిస్తారు. దీంతో పలువురు వ్యక్తులు కూరగాయలు బదులు ఆకుకూరలు కొనుగోలు చేస్తుంటారు. కానీ కొందరు వ్యాపారులు కక్కుర్తి పడుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఆకుకూరల వ్యాపారి చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. సదరు వ్యాపారి తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను మురుగు నీటిలో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. కొంతమంది ఈ త‌తంగాన్ని వీడియో తీసి భోపాల్ కలెక్టర్‌కు షేర్ చేశారు. దీంతో కలెక్టర్ ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తీవ్రంగా స్పందించారు. సదరు వ్యాపారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read Also: జాతీయ రహదారిపై మొసలి కలకలం

అంతేకాకుండా మురుగునీటిలో కొత్తమీర కట్టలను కడిగిన వ్యాపారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కలెక్టర్ పోలీసుల‌ను ఆదేశించారు. అయితే సదరు వ్యాపారి ధ‌ర్మేంద్ర‌ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యాపారి ఇంటి అడ్రస్ కనుగొన్నామని, కానీ అతను అక్కడ లేడని పోలీసులు తెలిపారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని వెల్లడించారు. నగర పౌరులకు ముప్పు కలిగించే ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.